నాలుగేళ్ల తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Jan 2025 4:06 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య, విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'వాడి వాసల్' అనే టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి, సెట్స్ మీదకు తీసుకెళ్లారు. 2020లో సూర్య బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. ఏమైందో ఏమో కానీ, ఈ చిత్రాన్ని అర్థాంతరంగా నిలిపివేశారు. అయితే చాలా కాలం వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. తాజాగా నిర్మాతలు దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అందించారు.
ఇటీవలే 'విడుదల పార్ట్ 2' సినిమాతో ప్రేక్షకులను అలరించిన వెట్రిమారన్.. తమిళ హీరో ధనుష్‌తో మూవీ చేయనున్నట్లు గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. పొల్లదావన్, ఆడు కాలమ్, వాడ చెన్నై, అసురన్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత వీరిద్దరూ ఐదోసారి చేతులు కలపబోతున్నారని తెలుస్తోంది. 'విడుదల 2' చిత్రం థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో, ధనుష్ - వెట్రిమారన్ ప్రాజెక్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో 'వాడి వాసల్' మరింత ఆలస్యం అవుతుందని అభిమానులు భావించారు. ఈ నేపథ్యంలో సూర్య సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వస్తుందనే ప్రకటన వచ్చింది.
'వాడివాసల్' చిత్రాన్ని వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూర్య - వెట్రిమారన్ లతో కలిసి దిగిన ఓ ఫోటోని చిత్ర నిర్మాత థాను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. దీనికి ''ఇంటర్నేషనల్ వర్షిప్ కోసం 'వాడివాసల్' తెరుచుకుంటుంది'' అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కాదని పరోక్షంగా ప్రకటించినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. 'కంగువ' ప్రమోషన్స్ లో సూర్య సైతం ‘విడుదలై 2’ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత వెట్రిమారన్ సినిమా తిరిగి పట్టాలెక్కుతుందని చెప్పారు. ఈ కాంబినేషన్ వీలైనంత త్వరగా సెట్స్ లో అడుగుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
'వాడి వాసల్' జల్లికట్టు సాంప్రదాయ క్రీడ ఆధారంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీని కోసం సూర్య జల్లికట్టులో శిక్షణ కూడా తీసుకున్నారు. ఆల్రెడీ రిలీజైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెడలో పులిగోరు ఉన్న తాడుతో న్యూ లుక్ లో సూర్య సర్ప్రైజ్ చేసాడు. మరో ఛాలెంజింగ్ రోల్ తో రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. పోస్టర్ లో హరప్పా, సింధు నాగరికతకు సంబంధించిన బొమ్మలు కనిపించడం మరింత ఆసక్తిని కలిగించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్నారు.
సూర్య ఇటీవలే 'రెట్రో' మూవీ షూటింగ్‌ను పూర్తి చేసారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సూర్య తన 45వ చిత్రం కోసం RJ బాలాజీతో జత కట్టారు. ఇందులో త్రిష కృష్ణన్ కథానాయికగా కనిపించనుంది. ఇదే క్రమంలో వెట్రి మారన్ 'వాడి వాసల్' రానుంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య ఓ సినిమా చేయనున్నారు.