స్టార్ హీరో క్రేజీ మూవీ క్యాన్సల్ వార్తలపై క్లారిటీ
వీరిద్దరి కాంబో లో రూపొందబోతున్న క్రేజీ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 16 Aug 2024 10:30 AM GMTతమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నాడు. అయితే శివ దర్శకత్వంలో చేసిన కంగువ సినిమా మేకింగ్ ఆలస్యం అవ్వడంతో విడుదలకు చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు కంగువా సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. దాంతో సూర్య తదుపరి సినిమాల విషయమై ఆసక్తికర చర్చ మొదలైంది. హీరోగా సూర్య నటించబోతున్న తదుపరి సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించబోతున్నాడు. వీరిద్దరి కాంబో లో రూపొందబోతున్న క్రేజీ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందాల్సిన వాడి వాసల్ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ వెట్రిమారన్ ప్రస్తుత చిత్రం 'విడుదలై 2' మేకింగ్ కు ఎక్కువ సమయం పడుతుంది. మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండో పార్ట్ కి ఎక్కువ సమయం కేటాయించి షూటింగ్ ను నిదానంగా చేయడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. వాడి వాసల్ సినిమా ప్రకటించి చాలా కాలం అయ్యి ఇప్పటి వరకు మొదలు కాకపోవడంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో వాడివాసల్ సినిమా రద్దు అయ్యింది, మేకింగ్ విషయంలో ఎదురు కాబోతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్మాత ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టాడు అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యాయి. ఆ వార్తలపై దర్శకుడు వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చాడు. విడుదల 2 సినిమా తో బిజీగా ఉండటం వల్ల, ఆ సినిమా తర్వాతే వాడి వాసల్ ను మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతోనే నేను ఆగుతున్నాను. నిర్మాత కూడా మాకు కావాల్సినంత సమయం తీసుకోవాల్సిందిగా చెప్పారు. అందుకే కాస్త ఆలస్యంగా ఆ సినిమా ప్రారంభం అవ్వబోతుందని చెప్పుకొచ్చాడు.
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న వెట్రిమారన్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. అలాంటి వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య సినిమా అనగానే అభిమానులు మరియు అన్ని వర్గాల ప్రేక్షకులు వాడి వాసిల్ సినిమా పై చాలా ఆశలు ఆసక్తి పెంచుకున్నారు. కానీ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో వారు నిరుత్సాహం వ్యక్తం చేశారు. వారందరికి ఆనందం కలిగించేలా వెట్రిమారన్ సినిమా క్యాన్సల్ వార్తలు పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ ను చూస్తే సినిమా జల్లికట్టు నేపథ్యం అని తేలిపోయింది. కనుక జల్లికట్టు సన్నివేశాల కోసం వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఎక్కువగానే చేయించాల్సి రావచ్చు. అందుకోసం ఎక్కువ సమయం పడుతుంది. అంటే 2025 లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు అసాధ్యం అని, ఈ సినిమా ను చూడాలి అంటే 2026 వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అనే అభిప్రాయం ప్రస్తుతం మీడియా సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది.