Begin typing your search above and press return to search.

'వేట్టయాన్' మూవీ రివ్యూ

'జై భీమ్'తో మంచి గుర్తింపు సంపాదించిన టీజీ జ్ఞానవేల్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

By:  Tupaki Desk   |   10 Oct 2024 7:15 AM GMT
వేట్టయాన్ మూవీ రివ్యూ
X

'వేట్టయాన్' మూవీ రివ్యూ

నటీనటులు: రజినీకాంత్-అమితాబ్ బచ్చన్-రానా దగ్గుబాటి-ఫాహద్ ఫాజిల్-మంజు వారియర్-రితికా సింగ్-దుషారా విజయన్-రావు రమేష్-కిషోర్-అభిరామి తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: ఎస్.ఆర్.కదిర్

నిర్మాత: సుభాస్కరన్

రచన- టీజీ జ్ఞానవేల్-కృత్తిక

దర్శకత్వం: టీజీ జ్ఞానవేల్

గత ఏడాది 'జైలర్' మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ తర్వాత ఆయన ప్రత్యేక పాత్రలో నటించిన 'లాల్ సలాం' నిరాశపరిచింది. ఇప్పుడాయన మళ్లీ లీడ్ రోల్ చేసిన మూవీ 'వేట్టయాన్'. 'జై భీమ్'తో మంచి గుర్తింపు సంపాదించిన టీజీ జ్ఞానవేల్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తమిళనాడులోని కన్యాకుమారిలో ఎస్పీగా పని చేసే అథియన్ (రజినీకాంత్)కు ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా దేశంలోనే గొప్ప పేరుంటుంది. సమాజానికి హానికరమైన నేరస్థులను ఆయన తనదైన శైలిలో ఏరి పారేస్తుంటాడు. చట్టం కంటే మనస్సాక్షిని నమ్మే అథియన్ కు తాను చేసే ఎన్ కౌంటర్ల విషయంలో పశ్చాత్తాపం ఏమీ ఉండదు. అథియన్ చేసిన ఒక గంజాయి స్మగ్లర్ ఎన్ కౌంటర్ కు సహకరించిన శరణ్య అనే ఉపాధ్యాయురాలు తర్వాత దారుణ హత్యకు గురవుతుంది. ఆమెను చంపింది గుణ అనే వ్యక్తి అని ఆధారాలుండడంతో అథియన్ అతణ్ని ఎన్ కౌంటర్ చేస్తాడు. కానీ ఈ ఎన్ కౌంటర్ మీద విచారణ జరిపిన జడ్జి సత్యదేవ్ (అమితాబ్) కొన్ని సంచలన విషయాలు బయటికి తీస్తాడు. దీంతో అథియన్ తొలిసారి పశ్చాత్తాప పడే పరిస్థితి వస్తుంది.. ఇంతకీ సత్యదేవ్ వెలికి తీసిన విషయాలేంటి.. దాని వల్ల అథియన్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.. చివరికి ఈ కేసు సంగతి ఏమైంది.. ఈ విషయాలన్నీ తెర మీదే చూడాలి.

కథనం-విశ్లేషణ:

స్టార్ల అవసరం లేని కథలు కొన్ని ఉంటాయి. స్టార్లు మాత్రమే చేయాల్సిన కథలూ కొన్ని ఉంటాయి. ఐతే స్టార్లు ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి మామూలు కథల్లోనూ నటిస్తూ వాటి రీచ్ పెంచే ప్రయత్నం చేస్తుండడం గత కొన్నేళ్ల నుంచి చూస్తున్న మంచి పరిణామం. టీజీ జ్ఞానవేల్ అనే అభిరుచి ఉన్న దర్శకుడితో సూర్య లాంటి స్టార్ హీరో ఇమేజ్ పక్కన పెట్టి 'జై భీమ్' అనే ఓ గొప్ప కథలో నటించడం వల్ల దాని రీచ్ ఎంతగానో పెరిగింది. ఆ ప్రయోగం ఫలించడం సూపర్ స్టార్ రజినీకాంత్ లోనూ అదే దర్శకుడితో పని చేయడానికి ఉత్సాహం కలిగింది. వీరి కలయికలో వచ్చిన 'వేట్టయాన్'లోనూ 'జై భీమ్' తరహాలోనే సామాజిక అంశాలతో ముడిపడ్డ ఓ మంచి కథనే చెప్పడానికి ప్రయత్నించాడు జ్ఞానవేల్. ఐతే రజినీ సూర్య లాంటి స్టార్ కాదు మరి. ఎంత వద్దనుకున్నా బయటికి రాలేని ఇమేజ్ ఛట్రం రజినీది. అందుకే కమర్షియల్ హంగులు జోడించక తప్పలేదు. అవి సినిమాలో సింక్ కాలేదని చెప్పలేం. అలా అని అవి పేలిపోయాయనీ చెప్పలేం. ఇక కథ విషయానికి వస్తే చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే అయినా.. అది 'జై భీమ్' తరహాలో ప్రేక్షకులను కదిలించే స్థాయిలో లేకపోయింది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ నడిచే థ్రిల్లర్ సినిమాలా ఆసక్తికరంగా నడిచే 'వేట్టయాన్' ఆపై సామాజిక అంశాల వైపు మళ్లి.. ఒక దశ దాటాక ప్రీచీగా తయారై.. చివరికి మామూలు సినిమాలా ముగుస్తుంది.

చట్టం కంటే మనస్సాక్షిని నమ్మే ఓ పోలీస్ అధికారి ఎన్నో ఎన్ కౌంటర్లు చేస్తాడు. కానీ అవేవీ పేరు కోసం చేసినవి కాదు. వాటి విషయంలో గర్వపడడు కూడా. అదే సమయంలో ఏ ఒక్క ఎన్ కౌంటర్ విషయంలో పశ్చాత్తాపం ఉండదు. ప్రతి ఎన్ కౌంటర్ విషయంలో తాను సమాధాన పడ్డాకే పని పూర్తి చేస్తాడు. అలాంటి అధికారి ఒక నిరపరాధిని అన్యాయంగా చంపేస్తే? ఆయనలో పశ్చాత్తాప భావం మొదలైతే..? ఇదే 'వేట్టయాన్' పాయింట్. కాన్ఫ్లిక్ట్ పాయింట్ దగ్గర 'వేట్టయాన్' ప్రేక్షకులకు మంచి హై ఇస్తుంది. అక్కడి వరకు కథ చాలా పకడ్బందీగా కూడా నడుస్తుంది. కానీ ఆ తర్వాత ఆ బిగి లేకపోవడం.. ఆసక్తి సన్నగిల్లిపోవడమే 'వేట్టయాన్' సమస్య. ప్రథమార్ధం వరకు మాత్రం 'వేట్టయాన్' మంచి టెంపోతో నడుస్తుంది. కథ ఎలాంటిదైనా రజినీ సినిమా అంటే విపరీతమైన బిల్డప్పులు.. ఎలివేషన్లు మామూలే. ఈ కథలో అవి సింక్ కాకపోయినా.. కథ చెడని విధంగా అక్కడక్కడా ఎలివేషన్లు ఇస్తూ.. బలంగానే కథను చెప్పే ప్రయత్నం చేశాడు జ్ఞానవేల్. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా హీరో పాత్ర పరిచయానికి ఒక ఎపిసోడ్ కేటాయించి.. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్లిపోయాడు. దుషారా విజయన్ చేసిన శరణ్య పాత్ర ప్రవేశంతో ఒక ఇంటెన్స్ మూవీని చూస్తున్న భావన మొదలవుతుంది. ఆమె సాయంతో హీరో ఓ స్మగ్లర్ ను ఎన్ కౌంటర్ చేయడం.. కానీ చివరికి ఆ అమ్మాయే చనిపోవడం.. దాని చుట్టూ మిస్టరీ.. దాన్ని పోలీసులు ఛేదించి హంతకుడిని చంపడం.. మళ్లీ అనూహ్యంగా కథ మలుపు తిరిగి పీటముడి బిగుసుకోవడం.. ఇలా 'వేట్టయాన్' రసవత్తరంగా నడుస్తుంది. అమితాబ్ బచ్చన్ పాత్రకు నిండుదనాన్ని తీసుకొస్తూ.. ఆ క్యారెక్టర్ ద్వారా కథలో కీలక మలుపు రావడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సమయానికి కథ రసకందాయంలో పడ్డట్లు కనిపిస్తుంది.

ఐతే ద్వితీయార్ధంలో చిక్కుముడులు కొంచెం వీడే వరకు ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేసే 'వేట్టయాన్' ఆ తర్వాత మాత్రం సాధారణంగా మారిపోతుంది. అసలు విలన్ ఎవరో వెల్లడైన దగ్గర్నుంచి కథను సాధారణంగా నడిపించాడు దర్శకుడు. అప్పటిదాకా థ్రిల్లర్ స్టయిల్లో ఆసక్తికరంగా నడిచే 'వేట్టయాన్' ఆ తర్వాత ఓ సామాజిక సమస్య చుట్టూ ప్రీచీగా తయారవుతుంది. ఎంచుకున్న సమస్య ముఖ్యమైందే అయినా.. ఇక్కడ విలన్ చేసిన స్కామ్ మీద నడిపిన డ్రామా మాత్రం సాధారణంగా అనిపిస్తుంది. ఈ ఫార్మాట్లో చాలా కథలు చూసి ఉండడం వల్ల ఒక దశ దాటాక ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లిపోతుం్ది. ఈ కథ రజినీ స్థాయికి చిన్నదిగా అనిపిస్తుంది. అమితాబ్ సైతం ఒక దశ దాటాక నామమాత్రంగా మారిపోయారు. మిగతా నటుల ప్రాధాన్యమూ తగ్గిపోయింది. సినిమా మొదలైన.. ఒక దశ వరకు నడిచిన తీరుకు.. చివరికి ముగిసిన తీరుకు పొంతన ఉండదు. జ్ఞానవేల్ 'జై భీమ్'లో ఒక కేసు చుట్టూనే కథను నడిపినా.. ఒక పెద్ద సమస్యను చర్చించిన ఫీలింగ్ కలుగుతుంది. కథలోని ఎమోషన్ ప్రేక్షకులను బలంగా తాకుతుంది. కానీ 'వేట్టయాన్' మాత్రం ఆ ఫీలింగ్ ఇవ్వదు. అలా అని దర్శకుడి ప్రయత్నాన్ని తక్కువ చేయలేం. అతను ఈసారి కూడా ఓ మంచి కథనే చెప్పాలని చూశాడు. రజినీని కొత్తగా ప్రెజెంట్ చేశాడు. ప్రథమార్ధంలో బిగి చూపించాడు. కొన్ని చోట్ల మెరుపులు మెరిపించాడు. కానీ ఓవరాల్ గా మాత్రం ఒక పకడ్బందీ సినిమాను అందించలేకపోయాడు. ఒకసారి చూడ్డానికి ఢోకా లేని.. 'జస్ట్ ఓకే' అనిపించే సినిమా ఇది.

నటీనటులు:

సూపర్ స్టార్ ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఆయన స్టయిల్లో ఓవర్ ద టాప్ ఎలివేషన్లు లేవు కానీ.. అక్కడక్కడా అభిమానులను అలరించే సీన్లు పడ్డాయి. చాలా వరకు కథతో పాటు సాగడానికే ప్రాధాన్యమిచ్చారు రజినీ. ఆయన స్టార్ పవర్ తో పాటు పెర్ఫామెన్స్ కూడా కనిపిస్తుంది ఇందులో. కొన్ని మామూలు సీన్లను కూడా సూపర్ స్టార్ ఆకర్షణీయంగా మార్చారు. అమితాబ్ బచ్చన్ జడ్జి సత్యదేవ్ పాత్రకు నిండుదనం తీసుకొచ్చారు. తెరపై మిగతా పాత్రల్లాగే.. ప్రేక్షకులు కూడా ఆయన కనిపించినపుడల్లా అలెర్ట్ అవుతారు. ఇంటర్వెల్ సీన్లో ఆయన ఆరా కనిపిస్తుంది. కానీ తర్వాత ఆ పాత్ర ప్రాధాన్యం తగ్గిపోయింది. సినిమాలో రజినీని మించి కీలక పాత్ర అంటే.. దుషారా విజయన్ దే. ఆమె నటన కూడా ఆకట్టుకుంటుంది. ఎక్కువగా సీరియస్-టిపికల్ రోల్స్ చేసే ఫాహద్ ఫాజిల్.. ఈ సినిమాలో సాధారణంగా కనిపిస్తూ వినోదం పంచే పాత్రలో నటించాడు. తన పెర్ఫామెన్స్ బాగుంది. నెగెటివ్ పాత్రలో రానా దగ్గుబాటి ఆకట్టుకున్నాడు. రజినీ ముందు అతను దీటుగా నిలబడ్డాడు. రజినీ భార్య పాత్రలో మంజు వారియర్ కనిపించిన కొన్ని సీన్లలో మెప్పించింది. రితిక సింగ్.. కిషోర్ పోలీస్ పాత్రల్లో ఓకే అనిపించారు. అభిరామి పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

అనిరుధ్ రవిచందర్ సంగీతం మరీ హై ఇవ్వదు. అలా అని నిరాశపరచనూ లేదు. మనసిలాయే పాట బాగుంది. ఇంకో పాట యావరేజ్. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే సాగింది. రజినీ ఎలివేషన్ సీన్లలో అనిరుధ్ ఎప్పట్లాగే డ్యూటీ చేశాడు. మిగతా స్కోర్ కొంచెం మామూలుగా అనిపిస్తుంది. కదిర్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్ గా సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలూ బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ 'జై భీమ్' తర్వాత తనపై పెరిగిన అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ తన ప్రయత్నం మాత్రం మెచ్చదగిందే. రజినీని ఈ కథలోకి తీసుకురావడం ద్వారా ఆయన్ని కొత్తగా ప్రెజెంట్ చేయడమే కాక.. కథకు రీచ్ పెంచగలిగాడు కానీ.. దాని వల్ల కథ పలుచన అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కథను చెప్పడంలో 'జై భీమ్' తరహాలో చివరి వరకు ఒకే తీవ్రతను జ్ఞానవేల్ ఇందులో చూపించలేకపోయాడు. ప్రథమార్ధం ఇన్వెస్టిగేషన్ డ్రామాను నడపడంలో చూపించిన నైపుణ్యాన్ని.. ద్వితీయార్ధంలో సమస్యను చెప్పడంలో ప్రదర్శించలేకపోయాడు. అతను ఎంచుకున్న టాపిక్ ప్రీచీగా.. కొంచెం బోరింగ్ గా తయారైంది.

చివరగా: వేట్టయాన్.. లేచి పడ్డాడు

రేటింగ్ - 2.5/5