సూపర్ స్టార్ మూవీ బడ్జెట్, రెమ్యూనరేషన్ లెక్కలు!
వేట్టయాన్ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ.125 కోట్ల పారితోషికం అందుకున్నారనే వార్తలు తమిళ మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 15 Oct 2024 2:45 AM GMTకోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల వేట్టయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వేట్టయాన్ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది అనేది బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రజనీకాంత్ గత చిత్రం జైలర్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.450 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. కనుక వేట్టయాన్ అంతకు మించి అన్నట్లుగా వసూళ్లు చేయాలని ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రెండు వందల కోట్ల వసూళ్లు మాత్రమే నమోదు చేసిందని, లాంగ్ రన్‌లో జైలర్ వసూళ్లను క్రాస్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రజనీకాంత్ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్‌లో ఉంది కనుక ఆయనతో సినిమా అనగానే వందల కోట్ల బిజినెస్ జరగడం ఖాయం. అందుకే ఆయన పారితోషికం వంద కోట్లకు పైగానే ఉంది. వేట్టయాన్ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ.125 కోట్ల పారితోషికం అందుకున్నారనే వార్తలు తమిళ మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. మొత్తంగా సినిమా బడ్జెట్ రూ.300 కోట్లుగా సమాచారం అందుతోంది. సినిమాలో రజనీకాంత్ తో పాటు పలువురు స్టార్స్ నటించారు. వారి పారితోషికాలు మాత్రం మరీ తక్కువగా ఉన్నాయి. రజనీకాంత్ పారితోషికంతో పోల్చితే వారి పారితోషికాలు మరీ షాక్ ఇచ్చే విధంగా తక్కువగా ఉన్నాయంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వేట్టయాన్‌లో నటించినందుకు గాను అమితాబ్ బచ్చన్‌కి రూ.7.5 కోట్ల పారితోషికం దక్కింది. బాలీవుడ్‌లో ఎలా అయితే అమితాబ్ పారితోషికం తీసుకుంటారో అలాగే ఈ సినిమాకు ఇవ్వడం జరిగిందట. ఆయన ఇచ్చిన డేట్లను అనుసారంగా కౌంట్ చేసి ఆ పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. కీలక పాత్రలో నటించిన రానా కు రూ.5 కోట్ల పారితోషికం అందిందట. ముఖ్య పాత్రలో నటించిన మంజు వారియర్ కి రూ.2.5 కోట్ల పారితోషికం దక్కింది. కీలక పాత్రలో నటించిన కొత్త అమ్మాయి రితిక సింగ్ మాత్రం రూ.50 లక్షల లోపు పారితోషికం మాత్రమే అందుకుందని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మొత్తానికి సినిమా బడ్జెట్ లో మెజార్టీ భాగంను రజనీకాంత్ పారితోషికంగా తీసుకున్నారు. ఇటీవల ఒక తమిళ్ దర్శకుడు హీరోల పారితోషికం భారీగా పెంచడం వల్ల మేకింగ్ ఇబ్బందిగా మారిందని, హీరోలు తమ పారితోషికం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా సూచించాడు. కానీ నిర్మాతలు మాత్రం ఆ హీరోలతో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో అడ్డు అదుపు లేకుండా పారితోషికం పెంచి ఇచ్చేస్తున్నారు. వంద కోట్లకు పైగా పారితోషికం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సినిమా ఫలితం తారు మారు అయితే నిర్మాతకు అదే స్థాయిలో నష్టాలు ఉంటాయి. కనుక పారితోషికాల విషయంలో ముందు ముందు అయినా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.