Begin typing your search above and press return to search.

'వేట్టయన్' రేటు తగ్గింది.. ఇప్పటికైనా లెక్క పెరుగుతుందా?

మల్టీ ప్లెక్సుల్లో రూ.200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ.110గా నిర్ణయించారు. అక్టోబర్ 18 నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నాయి.

By:  Tupaki Desk   |   16 Oct 2024 2:39 PM GMT
వేట్టయన్ రేటు తగ్గింది.. ఇప్పటికైనా లెక్క పెరుగుతుందా?
X

సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'వేట్టయన్ - ద హంటర్'. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు బాగానే కొనసాగింది. కానీ ఆ తరువాత మెల్లగా డౌన్ అవుతూ బచ్చింది.

ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన దిల్ రాజు, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌స్ ప్రమోషన్ కూడా గట్టిగానే చేశారు. అలాగే, సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ ద్వారా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గ్రాండ్ గానే విడుదలైంది. ఇక వీకెండ్ అనంతరం సినిమా కలెక్షన్లు చాలా తగ్గిపోయాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ ఒక నిర్ణయం తీసుకోక తప్పలేదు.

ఇప్పుడు, దసరా సెలవులు ముగియడంతో, తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలను తగ్గించాలని నిర్ణయించారు. మల్టీ ప్లెక్సుల్లో రూ.200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ.110గా నిర్ణయించారు. అక్టోబర్ 18 నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నాయి. టికెట్ ధరలు తగ్గించడంతో, ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చు, ఈ చిత్రానికి మరింత ఆదాయం రాబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'వేట్టయన్' సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ నటుల ప్రతిభ సినిమా లోని పాత్రలకు ప్రాణం పోసింది. సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు మొదట్లో పాజిటివ్ టాక్ రాలేదు.

కథలో న్యాయం, అధికారం, ఎన్‌కౌంటర్ హత్యలు, అవినీతి విద్యా వ్యవస్థ వంటి అంశాలను శక్తివంతంగా చూపించినప్పటికీ, సినిమా పట్ల ప్రేక్షకుల అభిప్రాయాలు మిశ్రమంగా ఉండటం ద్వారా సవాళ్లు ఎదుర్కొంది. ఇప్పటికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.240 కోట్ల వసూళ్లను నమోదు చేసిందని సమాచారం. కానీ, టికెట్ ధరలు తగ్గించడం వల్ల, వేట్టయన్ మరింత వసూళ్లు సాధించడం కోసం ముందుకు వెళ్ళనుందని టాక్ ఉంది.