Begin typing your search above and press return to search.

ఏపీ లో ‘ఛావా’ వివాదం.. కోర్టుకెక్కిన ముస్లిం ప్రెసిడెంట్!

బాలీవుడ్ లో సాలీడ్ వసూళ్లు రాబట్టిన ‘ఛావా’ సినిమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త వివాదానికి కారణమైంది.

By:  Tupaki Desk   |   6 March 2025 11:30 AM IST
ఏపీ లో ‘ఛావా’ వివాదం.. కోర్టుకెక్కిన ముస్లిం ప్రెసిడెంట్!
X

బాలీవుడ్ లో సాలీడ్ వసూళ్లు రాబట్టిన ‘ఛావా’ సినిమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త వివాదానికి కారణమైంది. దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 7న సినిమా విడుదల కానుండగా, ఏపీలో మాత్రం ఓ వర్గం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హాక్ ఈ సినిమా విషయమై అధికారికంగా స్పందించారు. చరిత్రను వక్రీకరించి తీసిన చిత్రంగా ‘ఛావా’ను అభివర్ణిస్తూ, ఈ సినిమాను ఏపీలో విడుదల చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. సినిమా కథను తారుమారు చేసి, కొందరి మనోభావాలను దెబ్బతీసేలా చిత్రీకరించారని, అందువల్లే తమ అభ్యంతరాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

ఇక ఇప్పటికే మహారాష్ట్రలో శంభాజీ మహారాజ్ భక్తులు భారీ స్థాయిలో ఈ సినిమాను ప్రోత్సహిస్తుండగా, మరోవైపు కొందరు వర్గాలు దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే హిందీలో 600 కోట్ల మార్కును దాటి, రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా, తెలుగులో విడుదలైతే మరింత భారీ వసూళ్లు సాధించగలదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో అనుకోని వివాదం మొదలుకావడం చిత్ర యూనిట్‌కు కొత్త సమస్యగా మారింది.

అయితే, ‘ఛావా’ చిత్రబృందం ఈ అభ్యంతరాలపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. తెలుగు వెర్షన్ ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఈ వివాదం ఏమాత్రం ప్రభావం చూపుతుందా లేదా అనుమతులతో సినిమా యథావిధిగా థియేటర్లలోకి రానుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక సినిమా కథ విషయానికి వస్తే, శంభాజీ మహారాజ్ జీవితంలోని కీలక ఘట్టాలను, ఆయన పోరాటాన్ని చూపించేలా తెరకెక్కిన ఈ మూవీ, దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల చేత అభినందనలు అందుకుంటోంది. నటుడు విక్కీ కౌశల్, శంభాజీ పాత్రలో అదిరిపోయే నటన ప్రదర్శించారని, సినిమా విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మరి, తెలుగు రాష్ట్రాల్లో ‘ఛావా’ సినిమాను జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.