Begin typing your search above and press return to search.

శంభాజీ మ‌హారాజ్ జాదూగ‌ర్ వేషాలు?

విక్కీ కౌశల్ జోరు మీద ఉన్నాడు. చారిత్రక డ్రామా `చావా` భారీ విజయంతో కెరీర్ బెస్ట్ ఫేజ్ కి చేరుకున్నాడు.

By:  Tupaki Desk   |   6 April 2025 10:30 PM
Vicky Kaushal Transforms into a Magician in First Look of Ek Jadugar
X

విక్కీ కౌశల్ జోరు మీద ఉన్నాడు. చారిత్రక డ్రామా `చావా` భారీ విజయంతో కెరీర్ బెస్ట్ ఫేజ్ కి చేరుకున్నాడు. అత‌డు ఇదే జోష్‌లో తదుపరి చిత్రం `ఏక్ జాదూగర్` ఫస్ట్ లుక్‌ను విడుదల చేసాడు. ఈసారి పూర్తిగా కొత్త లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇంద్ర‌జాలికుడిగా అత‌డి కొత్త వేష‌ధార‌ణ‌ సోషల్ మీడియాల్లో వైర‌ల్‌గా మారింది.


సెలబ్రిటీ ఫోటోగ్రాఫ‌ర్ వైరల్ భయానీ ఇన్‌స్టాలో షేర్ చేసిన `ఏక్ జాదూగర్` మొదటి పోస్టర్‌లో విక్కీ కౌశల్ అద్భుతమైన ఆకుపచ్చ దుస్తులలో కనిపించాడు. ఇంద్ర‌జాలికుడిగా అత‌డి మాయాజాలం మ‌రో లెవ‌ల్లో వ‌ర్క‌వుట్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పాత్ర‌కు త‌గ్గ‌ట్టే పొడ‌వాటి టోపీ, అత‌డి తీక్ష‌ణ‌మైన చూపులు, మెలి తిప్పిన మీస‌క‌ట్టు ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రానికి షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. పికు, అక్టోబర్ వంటి చిరస్మరణీయ చిత్రాల‌ను అందించిన బ్యానర్ రైజింగ్ సన్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

ఆశ్చ‌ర్య‌ప‌రిచే మ్యాజిక్ చూడటానికి సిద్ధంగా ఉండండి. విక్కీ కౌశల్ ఏక్ జాదూగర్ గా మంత్రముగ్ధులను చేయబోతున్నాడు! అని ఇన్ స్టాలో క్యాప్షన్ ఇచ్చారు. కామెంట్ సెక్షన్ వెంటనే ప్రశంసలతో నిండిపోయింది. ఒక అభిమాని ఇది ఆసక్తికరంగా ఉంది అని ప్ర‌శంసించాడు. విక్కీ కౌశల్ అద్భుతంగా ఉన్నాడు అని మ‌రొక అభిమాని రాశాడు. విక్కీ కౌశల్ విజృంభిస్తున్నాడు.. ద్వేషించేవారు ఏడుస్తున్నారు! అని కూడా ఒక అభిమాని అన్నాడు.

చావా చిత్రం ఫిబ్రవరి 14న విడుదలై దాదాపు 596.20 కోట్ల కలెక్షన్లను అధిగ‌మించింది. కొత్త తరానికి ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత‌క‌థ‌ను ఈ చిత్రం పరిచయం చేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. శివాజీ సావంత్ ఐకానిక్ మరాఠీ నవల `ఛవ` ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. మరాఠా సామ్రాజ్యాన్ని అత్యంత సవాళ్ల‌తో కూడిన కాలంలో పాలించిన ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవితాన్ని తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించారు. ఈ చిత్రంలో మహారాణి యేసుబాయిగా రష్మిక మందన్న, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. కథ చెప్పిన విధానం, విజువ‌ల్స్, శక్తివంతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు ద‌క్కాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ చేయనుంది. అయితే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.