డైరెక్టర్ పీఠం ఎక్కనున్న విక్కీ కౌశల్?
విక్కీ కౌశల్ బాలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతుడైన మనోహరమైన నటులలో ఒకరు.
By: Tupaki Desk | 30 Oct 2024 9:30 AM GMTవిక్కీ కౌశల్ బాలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతుడైన మనోహరమైన నటులలో ఒకరు. `యూరి` లాంటి సంచలన చిత్రంతో అతడి పేరు మార్మోగింది. కెరీర్ లో తన అద్భుత నటనా ప్రావీణ్యంతో విక్కీ మంత్రముగ్ధులను చేసాడు. నటుడిగా అతడిని ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడుతారో, అంతకుమించి ఆఫ్ ద స్క్రీన్ వ్యక్తిత్వంతోను అతడు లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు.
విక్కీ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ అందుకోలేదు. అతడు పరిశ్రమలో అనుభవించిన కష్టాల గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటాడు. తాను తీవ్ర ఆందోళన అభద్రతాభావంతో పోరాడానని వెల్లడించాడు. విక్కీ ఆందోళనను ఎదుర్కోవటానికి తన వ్యక్తిగత విధానం గురించి రివీల్ చేసాడు. అంతేకాదు తనకు దర్శకత్వం వహించాలని ఉందని కూడా వెల్లడించాడు.
బజార్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, విక్కీ కౌశల్ ఆందోళన (యాంగ్జయిటీ)ని మ్యానేజ్ చేయడం గురించి ఓపెనయ్యాడు. యువ క్రియేటర్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలిపాడు. ఆందోళన పెరగడానికి కారణం ఏమిటో గుర్తించడం చాలా అవసరం. ఆందోళనకు కారకుడైన శత్రువును గుర్తించాలి. అయితే ఆందోళన కారకుడిని చివరికి మీ స్నేహితుడిగా మార్చుకోండి! అని ఒక సీనియర్ నటుడు ఒకసారి నాకు చెప్పారు. ఇది (ఒత్తిడి అనేది) ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది. మీకు కేవలం నైపుణ్యం అవసరం. దానిని గుర్తించడం గొప్ప మొదటి అడుగు.. అని అన్నారు.
అదే ఇంటర్వ్యూలో క్రియేటివ్ రంగంలో ఎలా ఉండాలో కూడా మాట్లాడాడు. సవాళ్లు ఎదుర్కొనే సమయంలో, ఆందోళన లో కూరుకుపోయే బదులు సృజనాత్మక ప్రయోజనాలపై దృష్టి పెట్టడం ద్వారా అభివృద్ధి చెందుతానని వెల్లడించాడు. 36 ఏళ్ల విక్కీ తాను ప్రస్తుతం దర్శకత్వ ప్రపంచానికి ఆకర్షితుడయ్యానని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ -``సినిమా నిర్మాణంలో భిన్నమైన విధానాలు నన్ను ఆకర్షిస్తున్నాయి. నేను ఇంకా దర్శకత్వం వైపు అడుగులు వేస్తానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ నేను ఆసక్తిగా ఉన్నాను. ప్రతి పాత్రలో ఎవరైనా భిన్నంగా ఉండాలని కోరుకుంటాను. నేను ఎప్పుడూ అలా చేయాలని నన్ను సవాల్ చేసుకుంటాను`` అన్నారు.
విక్కీ బాలీవుడ్ లో మారుతున్న పరిణామాలపై మాట్లాడాడు. ఈ మార్పు విషయంలో ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ``మనం ఒక ఉత్తేజకరమైన దశలో ఉన్నాము. కొత్త స్వరాలు శక్తిని పొందుతున్నాయి. ప్రామాణికత ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తుంది. వైవిధ్యమైన కథనాలకు ప్రజలు మరింత ఓపెన్ అవుతున్నారు.. కనెక్టవుతున్నారు`` అని అన్నాడు.
విక్కీ కౌశల్ మొదట్లో గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ (2012) సెట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అసిస్టెంట్ గా చేసిన పని తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పాడు. మనోజ్ బాజ్‌పేయి, పంకజ్ త్రిపాఠి వంటి నటులు సంక్లిష్టమైన పాత్రలతో మెప్పించారని, అలాంటి ఛాలెంజింగ్ నటులను చూసి ప్రభావితుడినయ్యానని తెలిపాడు.