స్కైలో అంచనాలున్నా బోల్తా కొట్టిన మూవీ
సినిమా ఎత్తుగడ అద్భుతంగా ప్రారంభమవుతుంది. ఆరంభం పంచ్ లైన్ లు కొన్ని ఆకట్టుకుంటాయి. కానీ అంతలోనే గ్రాఫ్ డౌన్ అయిపోతుంది.
By: Tupaki Desk | 12 Oct 2024 11:30 AM GMTస్త్రీ 2 తో 500 కోట్ల క్లబ్ హీరో అయ్యాడు రాజ్‌కుమార్ రావ్. అతడు యానిమల్- గుడ్ న్యూజ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న ట్రిప్తి డిమ్రీతో కలిసి నటించిన కొత్త చిత్రం 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో'. రాజ్ శాండిల్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనే రచయిత.
నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన కల్పిత కథా చిత్రమిది. మెహందీ కళాకారుడు రాజ్ కుమార్ రావు , ఎంబిబిఎస్ విద్యార్థి విద్య (ట్రిప్తీ దిమ్రీ) ను వివాహం చేసుకోవాలనుకుంటాడు. చివరికి వారికి పెళ్లయాక, గోవాలో హనీమూన్ కోసం ప్లాన్ చేస్తారు. వైష్ణో దేవి పర్యటనను వారి కుటుంబం గిఫ్ట్ గా ఇస్తుంది. విక్కీ ఒక వార్త చదువుతాడు. అమెరికన్ జంటలు తాము సె*క్స్‌లో పాల్గొన్నప్పుడు రికార్డ్ చేసే అలవాటు... అది వారి వైవాహిక జీవితానికి సహాయపడుతుంది. తన భార్య విద్యను కూడా అలా చెప్పి ఒప్పిస్తాడు. మరుసటి రోజు వరకు అంతా బాగానే ఉంది. కానీ వారి ఇల్లు దొంగతనానికి గురయ్యాక అసలు కథ మొదలవుతుంది. వారి సె*క్స్ టేప్ కూడా మిస్సవుతుంది. విక్కీ సోదరి చందా (మల్లికా షెరావత్) .. దోపిడీ కేసులో దర్యాప్తు అధికారి (విజయ్ రాజ్) తో ట్రాక్ కూడా నడుస్తుంటుంది... చివరికి వీళ్లంతా తమ CDని కనుగొన్నారా లేదా? అనేదానికి సమాధానం అంత సులభం కాదు.
సినిమా ఎత్తుగడ అద్భుతంగా ప్రారంభమవుతుంది. ఆరంభం పంచ్ లైన్ లు కొన్ని ఆకట్టుకుంటాయి. కానీ అంతలోనే గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. సీడీని కనుగొనే ప్రయత్నంలోనే చాలా గజిబిజీ.. అర్థం లేని గందరగోళాన్ని సృష్టించాడు దర్శకుడు. నిజంగా ప్రతిభావంతుడైన రాజ్ శాండిల్యనే ఈ సినిమా తీసాడా? అంటూ ఆశ్చర్యపోతారు. దురదృష్టవశాత్తూ విక్కీగా రాజ్‌కుమార్ రావుకి చాలా చిత్రాలలో చూసేసిన అదే టైప్ రొటీన్ పాత్రలో కనిపిస్తాడు. అతడు తన కామిక్ టైమింగ్‌తో నవ్వించడానికి ప్రయత్నించాడు. కానీ కథ, దర్శకత్వం పరంగా పస లేకపోవడంతో పాత్రలు కూడా నిరాశపరిచాయి. ఒక పాయింట్ తర్వాత లీడ్ పాత్రలు కూడా చికాకును కలిగిస్తాయి. బాడ్ న్యూజ్ తర్వాత ఇక్కడ విద్యగా ట్రిప్టి డిమ్రీ మెరుగ్గా కనిపించినా కానీ, తన పాత్రలో ఆశించినదేదీ కనిపించదు. ఇందులో మల్లికా షెరావత్ తన పాత్రలో వ్యర్థమైంది. అశ్విని కల్‌శేకర్ పాత్ర కథకు ఉపయోగం లేనిది. ఆమె స్థాయి నటులు అలాంటి పాత్రలను పోషించడం సిగ్గుచేటు. అయితే ఈ సినిమా స్క్రిప్టు వివిధ కాలాల్లో సాగుతుంది. కానీ తెరకెక్కించిన విధానం చాలా బోరింగ్.
ఈ ప్రాజెక్ట్ పై వీక్షకులు తీవ్రంగా నిరాశ చెందారు. విమర్శకులు దుమ్మెత్తిపోసారు. ఇందులో చెత్త హాస్యాన్ని అందరూ ఏవగించుకుంటున్నారు. పదో తరగతి పిల్లవాడిలాగా జోకులు చెత్తగా ఉన్నాయని పలువురు నెటిజనులు కామెంట్ చేసారు. వయస్సు, లింగం, ప్రాంతీయత వంటి సున్నితమైన అంశాలపై జోక్ లు వేయడం ఆశ్చర్యపరుస్తుంది. వీటన్నింటికీ మించి కీలక నటుల జీవం లేని ప్రదర్శనలు నిరాశకు గురి చేసాయని విమర్శలు వచ్చాయి. T-సిరీస్ సమర్పించిన ఈ సినిమా...లో 90ల నాటి పాటలు ఓకే అనిపించినా కానీ ఛాయాగ్రహణం ఫర్వాలేదనుకున్నా కానీ అభిమానులకు ఆశించినది దక్కలేదు. ముగింపులో మహిళల గౌరవం, సామాజిక అవగాహనపై చాలా సామాజిక స్పృహతో సందేశాన్ని అందించే ప్రయత్నం చేసినా అది ఆశించినంతగా కనెక్టవ్వలేదు.