300 కోట్ల లాభాలిచ్చిన హీరో తొలి వేతనం రూ.1500
అయితే వందల కోట్ల వసూళ్లు చేసిన చిత్రంలో నటించిన విక్కీ కౌశల్ తన మొదటి వేతనంగా రూ. 1500 అందుకున్నాడన్నది ఎందరికి తెలుసు?
By: Tupaki Desk | 9 Sep 2023 1:30 AM GMTభారతీయ సినిమా చరిత్రలో అత్యంత లాభదాయకమైన చిత్రాలలో ఒకటిగా నిలిచిన 'యూరి'లో నటించాడు విక్కీ కౌశల్. నిజానికి నేటి ట్రెండీ హీరోల్లో ఒకడిగా విక్కీ ఎదుగుదల అనన్య సామాన్యం. ఇంతకీ అతడి తొలి జీతం ఎంతో తెలిస్తే షాక్ తింటారు. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి కొడుకు నేటితరం బెస్ట్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. ఒక్కో సినిమాకి కోట్లాది రూపయల పారితోషికం అందుకుంటున్నాడు. బాలీవుడ్ లో క్రేజీ హీరోల్లో ఒకడిగా ఎదిగిన విక్కీ కౌశల్ గతం గురించి, అతడి తొలి పారితోషికం గురించి తెలుసుకుంటే ఆసక్తికర విషయాలు తెలిసాయి.
దంగల్, RRR, KGF చాప్టర్ 2, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, పఠాన్ ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లను ఆర్జించిన భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో కొన్ని. అయితే ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి... వాస్తవానికి అవి అనూహ్యంగా లాభాలను ఆర్జించలేదు. కానీ 2019లో ఒక చిన్న చిత్రం వచ్చింది. అది భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత తక్కువ బడ్జెట్ తో రూపొందిన చిత్రాలలో ఒకటి. అంతేకాదు అది 876 శాతంతో ఆశ్చర్యకరమైన లాభాన్ని నిర్మాతలకు అందించింది. విక్కీ కౌశల్ నటించిన వార్ డ్రామా 'యూరి: ది సర్జికల్ స్ట్రైక్' సాధించిన ఘనత ఇది. ఈ చిత్రం భారతభూభాగంలో 2016 యూరీ దాడులకు ప్రతీకారంగా దాయాది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడుల ఆధారంగా రూపొందిన చిత్రం.
ఆదిత్య ధర్ 'యూరి'తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. మిలిటరీ యాక్షన్ చిత్రంలో నటనకు గానూ విక్కీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఈ చిత్రం ఉత్తమ ఆడియోగ్రఫీ, ఉత్తమ సంగీతం (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) విభాగంలో మరో రెండు అవార్డులను గెలుచుకుంది. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 240 కోట్ల నెట్‌ని .. ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. వార్- కబీర్ సింగ్ చిత్రాల తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది.
అయితే వందల కోట్ల వసూళ్లు చేసిన చిత్రంలో నటించిన విక్కీ కౌశల్ తన మొదటి వేతనంగా రూ. 1500 అందుకున్నాడన్నది ఎందరికి తెలుసు? భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత లాభదాయకమైన చిత్రాలలో ఒకటిగా నిలిచిన యూరి కథానాయకుడిగా ఉన్న విక్కీ స్వగతంలోకి వెళితే... ఇంజినీరింగ్ పూర్తి చేసాక.. నటనలోకి రావాలనుకున్నాడు అతడు. ఆ క్రమంలోనే తొలి పారితోషికం అందుకున్నానని తెలిపాడు. రాహుల్ డా కున్హా, రజిత్ కపూర్, షెర్నాజ్ పటేల్ సంయుక్తంగా నిర్వహించే రేజ్ ప్రొడక్షన్స్ అనే కంపెనీలో పనికి కుదిరాడుట. ఆ సమయంలో ప్రొడక్షన్ బాయ్‌గా పని చేసాడు. ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ హ్యాండిల్ చేసాడు. ''అక్కడ నా మొదటి సంపాదనగా రూ.1500 చెక్కును అందుకున్నాను'' అని విక్కీ గుర్తు చేసుకున్నాడు.
ఆ క్షణం నాకు చాలా ముఖ్యమైనది. అప్పటి వరకు నేను మా నాన్న బ్యాంకు పనిలో మాత్రమే సహాయం చేసేవాడిని. కాబట్టి చివరికి నా చెక్కును నా చేతులతో పట్టుకున్నప్పుడు అది ఒక మరపురాని అనుభవం. ఆ రాత్రి నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. రాత్రి 10:30 గంటలకు నేను బాంద్రా స్టేషన్‌లో కూర్చున్నాను. నా పేరు 'విక్కీ కౌశల్' అని రాసి ఉన్న రూ. 1500 చెక్కును చూస్తున్నాను! అని జ్ఞాపకాలలోకి వెళ్లాడు విక్కీ.
ఆసక్తికరంగా నేడు కోలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్న చియాన్ విక్రమ్ సైతం తొలి పారితోషికంగా 1500 అందుకున్నాడు. రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన 9నెలలు అనే చిత్రంలో విక్రమ్ నటించాడు. ఇందులో సౌందర్య ప్రధాన పాత్రధారి కాగా, విక్రమ్ సైడ్ రోల్ చేసాడు. గత కొన్ని సంవత్సరాలుగా విక్కీ బాలీవుడ్‌లో ఎంతో షైన్ అయ్యాడు. అత్యంత బ్యాంకబుల్ స్టార్లలో ఒకడిగా నిలిచాడు. అతని ఇటీవలి హిట్ చిత్రం 'జరా హాట్కే జరా బచ్కే'. సారా అలీ ఖాన్‌తో రొమాంటిక్ డ్రామాలో నటనకు మంచి పేరొచ్చింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ ని ఇటీవల పెళ్లాడిన విక్కీ కౌశల్ సంసార జీవితంలో సరిగమల్ని ఆస్వాధిస్తున్నాడు.