వెంకీ బడా లైనప్.. ముందు ఎవరితో?
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ తన రాబోయే సినిమాల కోసం నాలుగు పెద్ద నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
By: Tupaki Desk | 12 Jan 2025 10:30 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో జీరో హెటర్స్ ఉన్న అతికొద్ది మంది స్టార్స్ లలో విక్టరీ వెంకటేష్ టాప్ లో ఉంటారని చెప్పవచ్చు. తన సన్నివేశాలు, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో పాజిటివ్ వైబ్ తో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన తన కొత్త చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'తో సందడికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న సంక్రాంతి సందర్బంగా విడుదలవుతోంది.
సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న వెంకటేష్, తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ తన రాబోయే సినిమాల కోసం నాలుగు పెద్ద నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వాటిలో సురేష్ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, వైజయంతి మూవీస్, సితార ఎంటర్టైన్‌మెంట్స్ ఉన్నాయి. ఈ సంస్థలు ఆయన కోసం స్క్రిప్టులను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్టులన్నీ డిఫరెంట్ కథాంశాలతో ఉంటాయని, త్వరలో అధికారిక ప్రకటనలతో ప్రేక్షకులను అలరించనున్నారని పేర్కొన్నారు. వెంకటేష్ నెమ్మదిగానే, బలమైన కథలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తాను ఎలాంటి కొత్త ప్రాజెక్టును ఫైనలైజ్ చేయలేదని, ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం విడుదల తరువాత తన తదుపరి సినిమా గురించి స్పష్టమైన ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
ఈ స్థాయిలో నాలుగు పెద్ద నిర్మాణ సంస్థలతో ఒకే సమయంలో చర్చలు జరపడం వెంకటేష్ క్రేజ్‌ను మరోసారి స్పష్టంచేస్తోంది.
అయితే ముందుగా లిస్టులో మైత్రీ మూవీ మేకర్స్ తోనే వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో ప్రముఖ దర్శకులు అడ్వాన్స్ తీసుకొని కథలు సిద్ధం చేస్తున్నారు. ఇక వెంకీ కోసం ముందుగా ఫైనల్ చేసే అవకాశం ఉందట. అలాగే సురేష్ ప్రొడక్షన్ కూడా రెడీగా ఉన్నట్లు టాక్.
ఇదిలా ఉండగా, వెంకటేష్ ఇటీవల రానా నాయుడు 2 వెబ్ సిరీస్ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. టాలెంటెడ్ నటుడు రానా దగ్గుబాటి కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ వెంకటేష్‌కు పాన్ ఇండియా స్థాయిలో కొత్త ప్రేక్షకులను అందించనుందని భావిస్తున్నారు. వెంకటేష్ తన కెరీర్‌లో కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఇది మరోసారి నిరూపిస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ తన భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
కుటుంబ కథాచిత్రాల నుంచి ప్రయోగాత్మక చిత్రాల వరకు విభిన్నమైన కథలపై దృష్టి సారిస్తున్నారు. స్క్రిప్టులు సిద్ధం కాగానే, ఈ నాలుగు నిర్మాణ సంస్థల్లో ఒకటి లేదా ఎక్కువ సంస్థలతో కలిసి ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారని సమాచారం. సంక్రాంతికి వస్తున్నాం విడుదల తరువాత వెంకటేష్ తన కొత్త సినిమాలను ప్రకటిస్తారని తెలుస్తోంది.