Begin typing your search above and press return to search.

మెగాస్టార్ చిరంజీవి కోసం 'శంక‌ర్ దాదా 3' స్క్రిప్టు?

తాజాగా స్క్రిప్టు ర‌చ‌యిత విధు వినోద్ చోప్రా 3 ఇడియట్స్, మున్నా భాయ్‌కి సీక్వెల్‌లను ధృవీకరించారు. ప్ర‌స్తుతం ఈ రెండిటికీ స్క్రిప్టులు రెడీ అవుతున్నాయ‌ని తెలిపారు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 4:30 PM GMT
మెగాస్టార్ చిరంజీవి కోసం శంక‌ర్ దాదా 3 స్క్రిప్టు?
X

ప్ర‌పంచ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న భార‌తీయ సినిమాలుగా 3 ఇడియ‌ట్స్, మున్నాభాయ్ చిత్రాల‌కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. రాజ్ కుమార్ హిరాణి ఈ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, విధు వినోద్ చోప్రా స్క్రిప్టులు అందించారు. చాలా కాలంగా ఈ సినిమాల‌కు సీక్వెల్స్ రెడీ కానున్నాయ‌ని క‌థ‌నాలొస్తున్నా.. దానిపై పూర్తి క్లారిటీ లేదు.

తాజాగా స్క్రిప్టు ర‌చ‌యిత విధు వినోద్ చోప్రా 3 ఇడియట్స్, మున్నా భాయ్‌కి సీక్వెల్‌లను ధృవీకరించారు. ప్ర‌స్తుతం ఈ రెండిటికీ స్క్రిప్టులు రెడీ అవుతున్నాయ‌ని తెలిపారు. ప్ర‌ఖ్యాత 'దైనిక్ భాస్కర్' మ్యాగ‌జైన్ తో మాట్లాడుతూ విధు వినోద్ చోప్రా ప్రస్తుతం 2 ఇడియట్స్ , మున్నా భాయ్ 3 చిత్రాలతో పాటు ఇత‌ర‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లకు స్క్రిప్ట్‌లు రాస్తున్నట్లు ధృవీకరించారు.

''ఈ రెండు స్క్రిప్టులే కాదు.. నేను పిల్లల కోసం సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. హారర్ కామెడీ కూడా రాస్తున్నాను. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంద‌''ని చోప్రా అన్నారు. అయితే ఇవ‌న్నీ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, పూర్తి స్క్రిప్టులు రెడీ కావాల్సి ఉంద‌ని చెప్పారు. మొదట మేం 1-2 సంవత్సరాలు స‌మ‌యం తీసుకుని రాస్తాం. ఆపై వాటిని వంద‌శాతం బౌండ్ స్క్రిప్టుగా తయారు చేయాలి. త్వరలో 2 ఇడియట్స్, మున్నా భాయ్ 3 ల‌ను ప్ర‌క‌టించే వీలుంది'' అన్నారు.

అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి ప్ర‌ధాన పాత్ర‌ల్లో హిరాణీ తెర‌కెక్కించిన '3 ఇడియట్స్' 2009లో విడుదలై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. సంజయ్ దత్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో మున్నా భాయ్ సిరీస్ 2003లో ప్రారంభ‌మై బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా మారింది. ఇప్ప‌టికే ఈ ఫ్రాంఛైజీలో రెండు సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు మూడో సినిమా తీయాల్సి ఉంది. మున్నాభాయ్ 1, 2 భాగాలు టాలీవుడ్ లో మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ దాదా ఎంబిబిఎస్, శంక‌ర్ దాదా జిందాబాద్ పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. మున్నా భాయ్ 3 స్క్రిప్టు రెడీ అవుతోంది కాబ‌ట్టి మెగాస్టార్ చిరంజీవి కూడా దీనిపై స్పందిస్తారేమో చూడాలి.