Begin typing your search above and press return to search.

అబ‌ద్ధ‌పు మార్కెటింగ్‌.. ఫేక్ క‌లెక్ష‌న్స్‌పై ద‌ర్శ‌కుడు ఫైర్..

ఆయన మాట్లాడుతూ-''ఈరోజు మార్కెటింగ్ అబద్ధాలతో నిండిపోయింది. నకిలీ క‌థ‌నాలు వేసేందుకు ఇన్‌ఫ్లూయెన్స‌ర్ల‌కు డబ్బు చెల్లిస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 10:30 PM GMT
అబ‌ద్ధ‌పు మార్కెటింగ్‌.. ఫేక్ క‌లెక్ష‌న్స్‌పై ద‌ర్శ‌కుడు ఫైర్..
X

'ట్వ‌ల్త్ ఫెయిల్' లాంటి క్లాసిక్ చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు విధు వినోద్ చోప్రా. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా మ్యాజిక్ చేసింది. 20 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌గా, 70కోట్లు వ‌సూలు చేసింది. ఇదిలా ఉండ‌గానే అత‌డు తెర‌కెక్కించిన 'జీరో సే స్టార్ట్' డిసెంబర్ 13న థియేటర్లలో విడుద‌లై నిరాద‌ర‌ణ‌కు గురైంది. అయితే రిలీజ్ ముందు ఈ సినిమా గోవాలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో అంద‌రి దృష్టిని ఆకట్టుకుంది.

దైనిక్ భాస్కర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విధువినోద్ చోప్రా త‌న సినిమా వైఫ‌ల్యం గురించి బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఆయన మాట్లాడుతూ-''ఈరోజు మార్కెటింగ్ అబద్ధాలతో నిండిపోయింది. నకిలీ క‌థ‌నాలు వేసేందుకు ఇన్‌ఫ్లూయెన్స‌ర్ల‌కు డబ్బు చెల్లిస్తున్నారు. థియేటర్లు ఖాళీగా ఉంటే నిర్మాతలే స్వ‌యంగా టిక్కెట్లు కొని తప్పుడు బాక్సాఫీస్ నంబర్లు ప్రచారం చేస్తున్నారు'' అని ఆరోపించారు. నా చిత్రం నిన్న విడుదలైంది. చాలా తక్కువ మంది మాత్రమే వచ్చారు. తమ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాలేదని ఎవరూ ఒప్పుకోరు. కానీ నేను అంగీక‌రిస్తున్నాను. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చ‌దువుతున్న నా కూతురు ఫోన్ చేసిన‌ప్పుడు సినిమా స‌రిగా ఆడ‌లేద‌ని, ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు రాలేద‌ని చెప్పాన‌ని చోప్రా అన్నారు.

ఈ రోజు పరిశ్రమలో నిజాయితీ అరుదైన గుణమని, కష్టమైనప్పటికీ పారదర్శకతను కాపాడుకోగ‌లిగినందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు. ఈరోజుల్లో నోటి మాట మాత్రమే విజయానికి నమ్మదగిన కొలమానం అని చోప్రా చెప్పారు.

క‌మ‌ర్షియ‌ల్ గా లాభాల కంటే అభిరుచితో సినిమాలు తీసేందుకే ఇష్ట‌ప‌డ‌తాన‌ని, రాజీప‌డ‌లేన‌ని విధు వినోద్ అన్నారు. మంచి సంఖ్య‌ల‌ను వెంబ‌డించ‌డం నా ల‌క్ష్యం కాదు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా అర్థవంతమైన సినిమా తీయడంపై దృష్టి సారిస్తున్నాను అని అన్నారు. జ‌యాప‌జ‌యాలు త‌న‌కు కొత్తేమీ కాద‌ని వ్యాఖ్యానించారు.