Begin typing your search above and press return to search.

5ల‌క్ష‌ల అడ్వాన్స్ వెన‌క్కిచ్చి కోటిన్న‌ర సంపాదించా!

బాలీవుడ్ లో యూనిక్ జాన‌ర్ తో సినిమాలు తీయ‌డంలో ఫిలింమేక‌ర్ విధు వినోద్ చోప్రాకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది

By:  Tupaki Desk   |   6 May 2024 4:30 PM GMT
5ల‌క్ష‌ల అడ్వాన్స్ వెన‌క్కిచ్చి కోటిన్న‌ర సంపాదించా!
X

బాలీవుడ్ లో యూనిక్ జాన‌ర్ తో సినిమాలు తీయ‌డంలో ఫిలింమేక‌ర్ విధు వినోద్ చోప్రాకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఇంత‌కుముందు సంజ‌య్ ద‌త్ క‌థానాయ‌కుడిగా రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో మున్నాభాయ్ ఎంబిబిఎస్ రెండు భాగాల‌ను ఆయ‌నే నిర్మించారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ సంజ‌య్ ద‌త్ కి రీలాంచ్ మూవీ. టాడా కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాక అత‌డు ఈ సినిమాతో కంబ్యాక్ అయ్యాడు. ఈ చిత్రం థియేట్రిక‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. అయితే మున్నా భాయ్ MBBSని రిలీజ్ చేసేందుకు త‌మిళ‌నాడులో స‌హాయ‌నిరాక‌ర‌ణ ఎదురైందని ఇప్పుడు విధు వినోద్ చోప్రా పాత ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. అక్క‌డ పంపిణీదారులు ఎవ‌రూ రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని భావించార‌ట‌.

ఈ సినిమాని త‌మిళనాడులో పంపిణీ చేసేందుకు ఒక పంపిణీదారుడితో డీల్ కుదుర్చుకున్నాను. 5ల‌క్ష‌లు అడ్వాన్స్ చెల్లించాడు అత‌డు. కానీ రిలీజ్ కి మూడు రోజుల ముందు ఈ సినిమాని పంపిణీ చేయ‌లేన‌ని అత‌డు తిరిగి ఆ మొత్తాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. అప్ప‌టికి తాను ఆర్థికంగా చాలా క‌ష్టాల్లో ఉన్నా ఆ డ‌బ్బును వెన‌క్కి ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని నిర్మాత విధు వినోద్ తెలిపారు. తమిళనాడుకు చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌తో తన అనుభవాన్ని ఉటంకిస్తూ విధు వినోద్ చోప్రా ఆ సినిమాను స్వయంగా పంపిణీ చేయడం తప్ప వేరే మార్గం లేని ప‌రిస్థితి ఎదురైంద‌ని నాటి ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నాడు.

కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌తో ఫైర్‌సైడ్ చాట్‌లో విధు వినోద్ చోప్రా త‌న `ట్వ‌ల్త్ ఫెయిల్‌`కి కూడా సరిగ్గా అదే జరిగింద‌ని గుర్తు చేసుకున్నాడు. అప్ప‌ట్లో మున్నా భాయ్‌ని త‌మిళంలో ఎవరూ పంపిణీ చేయదలచుకోలేదు. నిజానికి ఒక వ్యక్తి... అతడి పేరును ఎప్పటికీ మర్చిపోలేను.. మొహమ్మద్ భాయ్.. అతడు తమిళనాడుకు చెందినవాడు. నా సినిమాను 11 లక్షలకు కొన్నాడు. 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అతడు వచ్చి నా సినిమా చూశాడు. `యే తో బిల్కుల్ కోయి నహీ సంఝేగా (ఎవరికీ అర్థం కాలేదు).. కాబట్టి ఈ సినిమాని పంపిణీ చేయ‌లేనని నా ప్రొడక్షన్ హెడ్‌కి చెప్పాడు. నేను 5 లక్షలు అత‌డికి తిరిగి ఇవ్వమని చెప్పాను. ఆ సమయంలో నేను చాలా పేదవాడిని.. మా దగ్గర డబ్బు లేదు. అతని 5 లక్షలు తిరిగి ఇచ్చాను. స‌రిగ్గా రిలీజ్ కి మూడు రోజుల ముందు ఇలా జ‌రిగింది అని గుర్తు చేసుకున్నారు.

చివ‌రి నిమిషంలో అలా జ‌రిగింది కాబట్టి ఇంకేం చేయాలి? తమిళనాడులో పెద్ద థియేటర్ అయిన సత్యంలో ఒక షో వేసిన డిస్ట్రిబ్యూటర్ ఫ్రెండ్ శ్యామ్ ష్రాఫ్‌కి ఫోన్ చేసాను. అతడు మున్నా భాయ్ కోసం 11.45 మార్నింగ్ షో ఇచ్చాడు. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా ఇత‌ర చోట్లా విడుద‌ల చేసాం. నేను తమిళనాడు నుండి ఆ ఒక్క సినిమాతో ఎంత డబ్బు సంపాదించానో తెలుసా? రూ. 1.67 కోట్లు... అని విధు వినోద్ తెలిపారు.

అదే చాట్ సెష‌న్‌లో విధు వినోద్ చోప్రా ఈ చిత్రంలో సంజయ్ దత్ ఎంపిక‌.. నాటి టెర్రిబుల్ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆయుధాల అక్ర‌మంగా క‌లిగి ఉన్నార‌న్న‌ కేసులో దోషిగా తేలిన తర్వాత పరిశ్రమ మొత్తం సంజ‌య్ ద‌త్ ని నిషేధించిందని.. సంఘీభావ చర్యలో భాగంగా తాను మాత్రం సంజూతో కలిసి పని చేస్తానని హామీ ఇచ్చానని విధు వినోద్ చెప్పాడు. షారుఖ్ ఖాన్ మొదట మున్నాభాయ్ గా ప్రధాన పాత్రను పోషించాల్సి ఉంది.. కానీ అతడు తప్పుకున్న త‌ర్వాత ఆ స్క్రిప్టు సంజయ్ ద‌త్ వ‌ద్ద‌కు వెళ్ళిందని వెల్ల‌డించారు.

రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన మున్నా భాయ్ MBBS చిత్రంలో సంజయ్ దత్ అతని తండ్రి సునీల్ దత్, గ్రేసీ సింగ్ , అర్షద్ వార్సి త‌దిత‌రులు నటించారు. ఈ చిత్రం విజయవంతమైంది. 2006లో లగే రహో మున్నా భాయ్ పేరుతో సీక్వెల్ తెర‌కెక్కింది. ఈ సీక్వెల్‌లో సంజయ్ సరసన విద్యాబాలన్ నటించింది. హిరాణీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాల‌ను శంక‌ర్ దాదా ఎంబీబీఎస్, శంక‌ర్ దాదా జిందాబాద్ పేరుతో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.