Begin typing your search above and press return to search.

'విడుదల-2' మూవీ రివ్యూ

గత ఏడాది తమిళంలో ఘనవిజయం సాధించిన 'విడుదల' తెలుగులో కూడా ఓ మోస్తరుగా ఆడింది.

By:  Tupaki Desk   |   20 Dec 2024 7:56 AM GMT
విడుదల-2 మూవీ రివ్యూ
X

నటీనటులు: విజయ్ సేతుపతి-మంజు వారియర్-సూరి-కిషోర్-గౌతమ్ మీనన్ తదితరులు

సంగీతం: ఇళయరాజా

ఛాయాగ్రహణం: వేల్ రాజ్

రచన: వెట్రిమారన్- జయమోహన్

నిర్మాత: ఎల్రెడ్ కుమార్-రామారావు చింతపల్లి

దర్శకత్వం: వెట్రిమారన్

గత ఏడాది తమిళంలో ఘనవిజయం సాధించిన ‘విడుదల’ తెలుగులో కూడా ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన సినిమా.. విడుదల-2. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వెట్రిమారన్ రూపొందించిన ఈ చిత్రం.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: ఎన్నో ఏళ్ల నుంచి పోలీస్ వ్యవస్థను ముప్పు తిప్పలు పెడుతున్న నక్సలైట్ నాయకుడు పెరుమాళ్ అలియాస్ మాస్టారు (విజయ్ సేతుపతి).. చివరికి ఓ ఆపరేషన్లో పోలీసుల చేతికి చిక్కుతాడు. ఈ ఆపరేషన్లో సాధారణ కానిస్టేబుల్ అయిన కుమరేశన్ (సూరి) కీలక పాత్ర పోషిస్తాడు. మాస్టారును పోలీసుల చెర నుంచి బయటికి తీసుకురావడానికి అతడి టీం సభ్యులు ప్రణాళిక రచిస్తారు. అదే సమయంలో అధికార వర్గాల్లో మాస్టారును కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటే.. ఎన్ కౌంటర్ చేయడానికి మరోవైపు రంగం సిద్ధం చేస్తారు. ఇదంతా ఓవైపు నడుస్తుంటే.. అసలు ఈ పెరుమాళ్ ఎవరు.. తన నేపథ్యం ఏంటి.. అతను మాస్టారుగా ఎందుకు మారాడు.. నక్సలైట్ నాయకుడిగా ఎలా ఎదిగాడు.. ఈ నేపథ్యంలో మరోవైపు ఈ కథ నడుస్తుంది. ఆ కథేంటి.. చివరికి మాస్టారు వ్యవహారం ఏ కంచికి చేరింది అన్నదే ఈ చిత్రం.

కథనం-విశ్లేషణ: తెలుగులో కొన్నేళ్ల కిందట ‘విరాట పర్వం’ అనే సినిమా వచ్చింది. వేణు ఉడుగుల ఆ కథను చాలా సిన్సియర్ గానే తెరకెక్కించాడు. స్వర్ణక్క అనే నక్సలైట్ కథను ఉన్నంతలో ఆసక్తికరంగానే నరేట్ చేశాడు. కానీ అందులో చూపించిన పరిస్థితులు ఇప్పుడు ఎక్కడా లేకపోవడం వల్లో.. తెర మీద చూపించిన విషాదం రుచించకో ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించలేదు. నక్సలైట్లు చురుగ్గా ఉన్న 90వ దశకంలో కృష్ణవంశీ ‘సింధూరం’ పేరుతో ఓ మంచి సినిమా తీస్తే అది ఆశించిన ఫలితాన్నందుకోలేదు. కానీ ‘సింధూరం’ ఒక కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. అన్నిసార్లూ బాక్సాఫీస్ సక్సెస్ మాత్రమే సినిమా స్థాయిని నిర్దేశించదు అనడానికి ఇలాంటి సినిమాలు ఉదాహరణ. ఈ కోవలో తమిళ అనువాద చిత్రం ‘విడుదల-2’ను కూడా ఓ గొప్ప ప్రయత్నంగా చెప్పొచ్చు. ఒక నక్సలైట్ నాయకుడి కథను ఎంతో రియలిస్టిగ్గా.. లోతుగా చూపించిన చిత్రమిది. నక్సలైట్లు-ప్రభుత్వం మధ్య ఘర్షణను చాలా బలంగా తెరపై ప్రెజెంట్ చేశాడు వెట్రిమారన్. కాకపోతే నక్సలైట్ల కోణంలో ఏకపక్షంగా ఈ కథను నరేట్ చేయడం.. డాక్యుమెంటరీ స్టయిల్లో కథనం సాగడం వల్ల ఇది అందరికీ రుచిస్తుందా అన్నది ప్రశ్న. కానీ ‘విడుదల-2’ గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు.

గత ఏడాది వచ్చిన ‘విడుదల’ చిత్రంలో ఒక నక్సలైట్ నాయకుడిని పట్టుకోవడానికి పోలీసులు చేసే పోరాటాన్ని చూపిస్తారు. ఈ క్రమంలో అడవుల్లో నక్సలైట్ ఆపరేషన్లలో పాల్గొనే పోలీసుల కష్టాలను.. అదే సమయంలో పోలీసు ఉన్నతాధికారుల అకృత్యాలు.. రాజకీయ నాయకుల కుట్రలు.. వీటన్నింటి గురించీ చర్చించాడు వెట్రిమారన్. అందులో కథంతా సూరి పోషించిన కుమరేశన్ అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కోణంలో నడుస్తుంది. ఆ కథకు అతనే హీరో. ఒక సాధారణ కానిస్టేబుల్ విధి నిర్వహణలో పడే కష్టాలు.. ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మనం చూడని కొత్త కోణాలెన్నింటినో చూపించాడు వెట్రిమారన్ అందులో. దీనికి తోడు నక్సలైట్ నాయకుడిని పట్టుకునే ఆపరేషన్ నేపథ్యంలో నడిచే పతాక సన్నివేశాలు కూడా అద్భుతంగా అనిపిస్తాయి. రెండో భాగంలో వెట్రిమారన్.. ఆ కథ నుంచి వెనక్కి వెళ్లి నక్సలైట్ నాయకుడి నేపథ్యం మీద ఫోకస్ చేశాడు. అతను ఎలా నక్సలైట్ నాయకుడిగా ఎదిగాడన్నదే ఇందులో ప్రధానాంశం. కానీ ఈ స్టోరీ అనుకున్నంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. కుల దురహంకారానికి బలమైన ఓ పేదవాడిని చూసి చలించిపోయి హీరో రెబల్ గా మారడం.. తర్వాత నక్సలైట్ కావడం.. అతడి వ్యక్తిగత జీవితం.. ఇవన్నీ కూడా రొటీన్ అనిపిస్తాయి. ఆరంభ సన్నివేశాలు బాగున్నా.. పెరుమాళ్ నేపథ్యానికి సంబంధించిన ఎపిసోడ్ మాత్రం చాలా సుదీర్ఘంగా సాగుతుంది. ఈ కథను గంటన్నరకు పైగానే నరేట్ చేశాడు వెట్రిమారన్. మంజు వారియర్ పాత్ర బాగుండి.. ఆమెకు విజయ్ సేతుపతికి మధ్య సాగే మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది కానీ.. మిగతా వ్యవహారమంతా బోర్ కొట్టిస్తుంది. ఎన్నో సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇక్కడా కనిపిస్తాయి.

పెరుమాళ్ బ్యాక్ స్టోరీ అంతా అయ్యాక కానీ ‘విడుదల-2’ మళ్లీ పట్టాలెక్కదు. పోలీసుల చెర నుంచి అతను తప్పించుకోవడం.. తిరిగి అతణ్ని పట్టుకోవడానికి పోలీసులు చేపట్టే ఆపరేషన్.. ఈ వ్యవహారమంతా చాలా ఎగ్జైటింగ్ గా నడుస్తుంది. పెరుమాళ్ కథకు ఇచ్చిన ముగింపు కూడా బాగుంది. చివరి 40 నిమిషాలు ‘విడుదల-2’కు ఆయువుపట్టు. పోలీసులు-నక్సలైట్లలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అంటూ చర్చలేమీ పెట్టకుండా.. బ్యాలెన్స్ పాటించే ప్రయత్నం చేయకుండా.. వెట్రిమారన్ ‘విడుదల’లో మాదిరే ఇందులోనూ ఒక సైడ్ తీసేసుకున్నాడు. నక్సలైట్ల పక్షపాతిలాగే ఈ కథను నరేట్ చేశాడు. ఐతే ప్రస్తుతం నక్సలైట్ల ఉనికే కనిపించని ఈ రోజుల్లో.. ఈ కథకు ఇప్పటి ప్రేక్షకులకు ఎంతమేర రిలేట్ అవుతారన్నది ప్రశ్నార్థకం. ఇక ఈ కథను డాక్యుమెంటరీ స్టయిల్లో రియలిస్టిగ్గా నరేట్ చేయడం కూడా దీని కమర్షియల్ సక్సెస్ ను పరిమితం చేయొచ్చు. వెట్రిమారన్ శైలి నచ్చేవాళ్లకు.. సీరియస్ గా.. రియలిస్టిగ్గా సాగే సినిమాలను ఇష్టపడే వారికి ‘విడుదల-2’ బాగానే అనిపిస్తుంది. ‘విడుదల’ చూసి మెచ్చిన వాళ్లు నిరభ్యంతరంగా ఈ సినిమా చూడొచ్చు. అది రుచించని వాళ్లకు మాత్రం ఇది కూడా ఎక్కకపోవచ్చు.

నటీనటులు: వెట్రిమారన్ సినిమాలంటేనే అద్భుతమైన పెర్ఫామెన్సులు చూడొచ్చు. ఇక విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటుడు తన సినిమాలో నటిస్తే ఇక చెప్పేదేముంది? ఎక్కడా రవ్వంత కూడా అతి చేయకుండా పాత్రకు తగ్గట్లుగా అద్భుతంగా నటించాడు సేతుపతి. నటిస్తున్నట్లు అనిపించకుండా పాత్రకు తగ్గట్లు బిహేవ్ చేయడంలోనే తన ప్రత్యేకత తెలుస్తుంది. మంజు వారియర్ కూడా గొప్పగా నటించింది. సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ తనదే. సూరి మరోసారి మెప్పించాడు. ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. రాఘవేందర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ పాత్రలో చేసిన నటుడు పార్ట్-1లో మాదిరే అదరగొట్టేశాడు. ఆముదన్ పాత్రలో చేసిన నటుడు కూడా బాగా నటించాడు. కిషోర్.. గౌతమ్ మీనన్.. మిగతా నటీనటులంతా కూడా బాగా పెర్ఫామ్ చేశారు.

సాంకేతిక వర్గం: ‘విడుదల-2’లో సాంకేతిక నిపుణులందరూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. ఇళయరాజా.. పాటలతో పాటు నేపథ్య సంగీతంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన తన బాణీ చూపించిన చిత్రమిది. వేల్ రాజ్ ఛాయాగ్రహణం సూపర్బ్. ఈ వింటేజ్ కథకు ఎంచుకున్న కలర్ థీమ్ ఒకేసారి మనల్ని 30-40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోతుంది. ఒక డిఫరెంట్ మూడ్ క్రియేట్ చేసి ఈ కథను నరేట్ చేసింది వెట్రిమారన్-వేల్ రాజ్ జోడీ. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. వెట్రిమారన్ మరోసారి రచయితగా.. దర్శకుడిగా తనేంటో చూపించాడు. వామపక్ష భావజాలానికి మద్దతుగా అతను ఒక సైడ్ తీసుకోవడం మీద అభ్యంతరాలు ఉండొచ్చు కానీ.. ఈ కథను ఎంతో నిజాయితీగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. తన కథన శైలి గొప్పగా అనిపిస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ తన ముద్ర కనిపిస్తుంది. మాస్టారు బ్యాక్ స్టోరీని ఇంకా ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని ఉండొచ్చు.. దాన్ని మినహాయిస్తే మిగతా సినిమా అంతా వెట్రిమారన్ రచయితగా-దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు.

చివరగా: విడుదల-2.. ఇంటెన్స్ రెబల్ స్టోరీ

రేటింగ్-2.75/5