Begin typing your search above and press return to search.

పుదుచ్చేరి పర్యటన పుకార్లపై స్పందించిన నయనతార భర్త!

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఈ మధ్య పుదుచ్చేరికి వెళ్లి ముఖ్యమంత్రి, పర్యాటక శాఖా మంత్రితో భేటీ అయ్యారు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 6:16 AM GMT
పుదుచ్చేరి పర్యటన పుకార్లపై స్పందించిన నయనతార భర్త!
X

సౌత్ సెలబ్రిటీ కపుల్ నయనతార - విఘ్నేష్ శివన్ ఇటీవల కాలంలో సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ధనుష్ వివాదంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ జంట.. రీసెంట్ గా మరో కొత్త పుకారుతో వార్తల్లోకి వచ్చారు. పాండిచ్చేరి ప్రభుత్వానికి చెందిన సీగల్స్ హోటల్‌ను కొనుగోలు చేయడానికి నయన్ దంపతులు గట్టి ప్రయత్నిస్తున్నారని, దాని గురించి తరచుగా అధికారులను కలుస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఈ మధ్య పుదుచ్చేరికి వెళ్లి ముఖ్యమంత్రి, పర్యాటక శాఖా మంత్రితో భేటీ అయ్యారు. దీంతో అక్కడ సుందరమైన బీచ్ రోడ్‌లో ఉన్న ప్రఖ్యాత సీగల్స్ హోటల్‌ను కొనుగోలు చేయడానికే ఆయన అక్కడికి వెళ్లారనే ప్రచారం మొదలైంది. హోటల్ రేటు గురించి చర్చించడానికి టూరిజం మినిస్టర్ లక్ష్మీ నారాయణన్ ని నయనతార భర్త కలిసారని, కానీ ప్రభుత్వ ఆస్తి అమ్మకానికి లేదని నిర్ధారించడంతో ఆయన ప్రతిపాదన తిరస్కరించబడిందని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అంతేకాదు ప్రభుత్వ ఆస్తి అమ్మకానికి లేదని అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత కూడా విఘ్నేష్ శివన్ ఆ హోటల్‌ను లీజుకు తీసుకునే ఆలోచన చేసారని, కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ అమ్మకానికి లేదా లీజుకు అందుబాటులో లేదని ప్రభుత్వం పునరుద్ఘాటించిందని చెప్పుకున్నారు. ఈ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ లో దీనిపై స్పందించారు. తన పాండిచ్చేరి పర్యటనకు అసలు కారణాన్ని వెల్లడిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

"నేను పాండిచ్చేరి విమానాశ్రయాన్ని సందర్శించి నా సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' షూటింగ్ అనుమతి తీసుకోడానికి అక్కడికి వెళ్ళాను. గౌరవ మర్యాదలతో ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖా మంత్రిని కలిశాను. అనుకోకుండా, నాతో పాటు వచ్చిన లోకల్ మేనేజర్ నా మీటింగ్ తర్వాత దేని గురించో వాళ్ళతో మాట్లాడారు. అది పొరపాటున నాకు లింక్ చేయబడింది. ఈ విషయంలో నా మీద క్రియేట్ చేసిన మీమ్స్, వీడియోలు మరియు జోకులు నిజంగా ఫన్నీగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. కానీ అవన్నీ అనవసరం. అందుకే నేను ఈ విషయాన్ని స్పష్టం చేయాలనుకున్నాను. థ్యాంక్యూ" అని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో నయన్ దంపతులపై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

ఇకపోతే 'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా విగ్నేష్ శివన్ ''LIK - లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఈ చిత్రానికి 'LIC - లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' అని అర్థం వచ్చేలా టైటిల్ పెట్టారు. దీనిపై LIC కంపెనీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అభ్యంతరం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి నోటీసులు జారీ చేసింది. దీంతో 'LIK' గా టైటిల్ ను మార్చారు.

ఇదిలా ఉంటే విఘ్నేష్ శివన్ - నయనతార మీద రూపొందించిన డాక్యుమెంటరీలో తన సినిమా క్లిప్‌లను ఉపయోగించడంపై హీరో ధనుష్‌ అభ్యంతరం వ్యక్తం చేసారు. ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’లో 'నానుమ్‌ రౌడీ దాన్‌' సినిమా విజువల్స్‌ వాడుకోడానికి ధనుష్ ఎన్ఓసీ ఇవ్వలేదంటూ నయన్ ఓపెన్ లెటర్ ద్వారా తీవ్ర విమర్శలు చేయడం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. మూడు సెకండ్ల బీటీఎస్ ఫుటేజీ వాడినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపారని తెలిపింది. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ధనుష్.. అనుమతి లేకుండా తన సినిమాలోని విజువల్స్ ను డాక్యుమెంటరీలో ఉపయోగించారంటూ నయనతార దంపతులపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది.