రష్మికతో కలిసి జులై నుంచి మొదలెట్టనున్న విజయ్
రాహుల్ సాంకృత్స్యన్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 28 Jan 2025 9:14 AM GMTరాహుల్ సాంకృత్స్యన్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో 1854-78 మధ్య కాలంలో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
రీసెంట్ గా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ నిన్న మొదలైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. బ్రిటీష్ పాలనా కాలంలో ఇప్పటివరకు ఎవరూ తెరకెక్కించని యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
సెట్ వర్క్ మొత్తం వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని జులై లేదా ఆగస్టు నుంచి సినిమాను రెగ్యులర్ షూట్ కు తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈలోగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న వీడీ12 ని పూర్తి చేసి రిలీజ్ కూడా చేసేసి ఫ్రీ అవుతాడు. రాహుల్ సాంకృత్య్సన్ తో విజయ్ చేస్తున్న ఈ సినిమా తన కెరీర్లో 14వ మూవీగా తెరకెక్కనుంది.
అయితే వీడీ14లో విజయ్ లుక్ మిగిలిన సినిమాల లుక్ కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ పక్కన రష్మిక నటిస్తుండటంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. వీరిద్దరూ కలిసి గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేశారు. ఆ రెండు సినిమాలకీ టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఇక ఇప్పటికే విజయ్ రాహుల్ సాంకృత్య్సన్ తో కలిసి ట్యాక్సీవాలా సినిమా చేసి మంచి హిట్ అందుకుని ఉన్నాడు. అప్పట్నుంచే రాహుల్, విజయ్ కలిసి మరో సినిమా చేద్దామనుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు వారి కాంబో సెట్ అయింది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ డియర్ కామ్రేడ్, ఖుషి సినిమాలు చేయగా, ఆ రెండు ఫ్లాపులుగానే మిగిలాయి. దీంతో ఎలాగైనా మైత్రీ బ్యానర్ లో విజయ్ హిట్ కొట్టాలని చాలా కసిగా ఉన్నాడు.