Begin typing your search above and press return to search.

'పుష్ప 3' ర్యాంపేజ్‌.. మూడేళ్ళ క్రితమే చెప్పిన విజయ్ దేవరకొండ!

నిజానికి 'పుష్ప 3' గురించి మూడేళ్ళ క్రితమే యువ హీరో విజయ్ దేవరకొండ హింట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 9:41 AM GMT
పుష్ప 3 ర్యాంపేజ్‌.. మూడేళ్ళ క్రితమే చెప్పిన విజయ్ దేవరకొండ!
X

యావత్ సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ''పుష్ప 2: ది రూల్'' సినిమా ఎల్లుండి డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ ను రూల్ చేయడం ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ మ్యానియా గురించే చర్చలు జరుగుతున్న తరుణంలో.. 'పుష్ప' పార్ట్-3కి సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

'పుష్ప' ప్రాంచైజీలో ''పుష్ప 3'' సినిమా కూడా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అది నిజం చేస్తూ, చిత్ర బృందం తాజాగా ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. 'పుష్ప 2' చిత్రానికి సౌండ్‌ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్న ఆస్కార్‌ అవార్డు విజేత రసూల్‌ పూకుట్టి.. తన టీమ్ తో కలిసి దిగిన ఓ ఫొటోని ఎక్స్ లో పంచుకున్నారు. ఇందులో వారి బ్యాగ్రౌండ్ లో స్క్రీన్ మీద ''పుష్ప 3: ది ర్యాంపేజ్‌'' అనే టైటిల్ కార్ట్ ఉంది. కాసేపటికే ఈ ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో పార్ట్‌-2 ఎండింగ్ లోనే పార్ట్-3కి సంబంధించిన లీడ్ ఇవ్వబోతున్నారని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

నిజానికి 'పుష్ప 3' గురించి మూడేళ్ళ క్రితమే యువ హీరో విజయ్ దేవరకొండ హింట్ ఇచ్చారు. డైరెక్టర్ సుకుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ''2021 - ది రైజ్, 2022 - ది రూల్, 2023 - ది ర్యాంపేజ్‌'' అంటూ ట్వీట్ చేసారు. అయితే వీడీ చెప్పిన ఏడాదిలో ఈ సినిమాలు రానప్పటికీ, ఫ్యూచర్ లో ''పుష్ప 3: ది ర్యాంపేజ్‌'' సినిమా ఉంటుందని ఇప్పుడు రసూల్‌ పూకుట్టి పోస్టుతో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో #Pushpa3TheRampage అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో 'పుష్ప 2' కి కొనసాగింపుగా 'పుష్ప 3' ఉంటుందా? అని ప్రశ్నించగా.. ఉంటుందని మైత్రీ నిర్మాత వై. రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. 'పుష్ప 2: ది రూల్‌' చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేస్తే, తప్పకుండా పార్ట్-3 కూడా చేస్తామని తెలిపారు. సెకండ్ పార్ట్ ఎండింగ్ లోనే 'పుష్ప 3' చిత్రానికి లీడ్ కచ్చితంగా ఉంటుందని తెలిపారు. గతంలో అల్లు అర్జున్ సైతం 'పుష్ప 3' గురించి హింట్ ఇచ్చారు. 74వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బన్నీ మాట్లాడుతూ.. పార్ట్-3 ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చని అన్నారు. 'పుష్ప' సినిమాని ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నామని, ఈ లైనప్ కోసం అద్భుతమైన ఐడియాలు సుకుమార్ దగ్గర ఉన్నాయని చెప్పారు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ‘పుష్ప వైల్డ్‌ జాతర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లోనూ దర్శకుడు సుకుమార్‌ 'పుష్ప 3' పై మాట్లాడారు. ''నేను మీ హీరోని మూడేళ్లు కష్టపెట్టాను. మీరు మీ హీరోని అడగండి. నేను నా ఫ్రెండ్‌ (అల్లు అర్జున్‌)ను అడుగతాను. నా కోసం మళ్లీ మరో మూడేళ్లు ఇస్తే తప్పకుండా ‘పుష్ప 3’ చేస్తాను'' అని సుక్కూ అన్నారు. 'పుష్ప 2' క్లైమాక్స్ లో మూడో భాగానికి లీడ్ ఇవ్వడాన్ని బట్టి చూస్తుంటే, కాస్త లేట్ అయినా ''పుష్ప 3: ది ర్యాంపేజ్‌'' రావడం గ్యారంటీ అని తెలుస్తోంది.