అలాంటి మోసాలపై విజయ్ దేవరకొండ హెచ్చరిక!
ఇక రీసెంట్ గా ఆన్ లైన్ మోసాలపై మరోసారి తనదైన శైలిలో ఒక వివరణ ఇచ్చారు.
By: Tupaki Desk | 8 Jan 2025 11:15 AM GMTసౌత్ ఇండియన్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కేవలం సినిమాలతోనే కాకుండా అప్పుడప్పుడు సమాజానికి ఉపయోగపడేలా కొన్ని ప్రత్యేకమైన సందేశాలు కూడా ఇస్తుంటారు. ఇక రీసెంట్ గా ఆన్ లైన్ మోసాలపై మరోసారి తనదైన శైలిలో ఒక వివరణ ఇచ్చారు. ఫేక్ కాల్స్, మెసేజ్‌లపై అభిమానులకు హెచ్చరికలు జారీ చేశారు.
సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలంటూ, సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను విడుదల చేసి చైతన్యం కల్పించారు. ఈ సందేశంతో సైబర్ నేరగాళ్ల చిట్కాలను గుర్తించమని విజ్ఞప్తి చేశారు. విజయ్ ఈ వీడియోలో తన స్నేహితుడి అనుభవాన్ని పంచుకున్నారు. యూపీఐ పేమెంట్స్ ఎంత సురక్షితమైనవో చెప్పడంతో పాటు, కొన్ని సందర్భాల్లో మోసగాళ్లు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లుగా చూపిస్తూ నకిలీ మెసేజ్‌లు పంపించగలరని చెప్పారు.
టెక్నాలజీ వృద్ధితో పాటు నేరగాళ్ల మోసాలు కూడా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా ఫేక్ మెసేజ్‌లు లేదా కాల్స్ చేస్తే, డబ్బులు పంపే ముందు నిజానిజాలు బాగా తెలుసుకోండి.. ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు, కంగారుకు లోనుకాకుండా బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయాలని సూచించారు. ‘‘ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే, వారికి చెప్పండి, నేను మూర్ఖుడిని కాదు’’ అని విజయ్ స్పష్టం చేశారు.
మోసగాళ్లు తమను నమ్మించే ప్రయత్నంలో స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా దగ్గరయ్యే అవకాశం ఉందని కూడా విజయ్ హెచ్చరించారు. వారి నిజస్వరూపాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ భద్రతలో అప్రమత్తత అవసరమని, నేరగాళ్ల వల్ల చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. విజయ్ దేవరకొండ, నటుడిగానే కాకుండా, సమాజానికి బాధ్యతగల వ్యక్తిగా నిలుస్తూ, ఇలాంటి చైతన్యవంతమైన సందేశాలు ఇవ్వడం ఫ్యాన్స్‌ను మరింత ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం విజయ్ పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తదుపరి సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD 12. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక మరోవైపు రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. అలాగే, రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఒక విభిన్న కథాంశంతో తెరకెక్కుతుందని తెలుస్తోంది. అలాగే రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్.