Begin typing your search above and press return to search.

రౌడీ బాబుకి ఇది సవాలే..

ప్రస్తుతం తన ఫోకస్ అంతా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న ‘కింగ్ డమ్’ మీదే ఉంది. నిన్ననే దీని టీజర్ లాంచ్ అయింది.

By:  Tupaki Desk   |   13 Feb 2025 7:30 PM GMT
రౌడీ బాబుకి ఇది సవాలే..
X

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, ట్యాక్సీవాలా, గీత గోవిందం చిత్రాలతో ఒక దశలో మామూలు వైభవం కాదు విజయ్ దేవరకొండది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అంతటివాడు.. తాను స్టార్ కావడానికి చాలా ఏళ్లు పట్టిందని, కానీ విజయ్ మాత్రం తక్కువ టైంలో పెద్ద స్టార్ అయిపోయాడని కితాబిచ్చాడంటే విజయ్ రైజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కానీ తక్కువ టైంలో పెద్ద పెద్ద సక్సెస్‌లతో తనకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను విజయ్ నిలబెట్టుకోలేకపోయాడు. సరైన సినిమాలు ఎంచుకోక గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు. వరల్డ్ ఫేమస్ లాంటి సినిమాలు ఫెయిలైనా.. తన ప్రయత్నాన్ని ఎవ్వరూ తప్పుబట్టలేదు. కానీ లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాలు మాత్రం తన జడ్జిమెంట్‌ను ప్రశ్నార్థకం చేశాయి. ‘లైగర్’ టైంలో తన యాటిట్యూడ్ కూడా విమర్శలకు దారి తీసింది. వరుస డిజాస్టర్లు ఎలాంటి హీరోనైనా జావగారిపోయేలా చేస్తాయి. విజయ్ కూడా అందుకు మినహాయింపు కాలేకపోయాడు. విజయ్ కొంత కాలంగా బయట కనిపించడం లేదు. కనిపించినా మునుపటి యాటిట్యూడ్ లేకపోవడం గమనించవచ్చు.

ప్రస్తుతం తన ఫోకస్ అంతా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న ‘కింగ్ డమ్’ మీదే ఉంది. నిన్ననే దీని టీజర్ లాంచ్ అయింది. ఈ సినిమా గురించి యూనిట్ వర్గాలు చెబుతున్న దాంట్లో, ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారంలో అతిశయోక్తి లేదనిపించింది టీజర్ చూస్తే. చాలా పెద్ద కాన్వాస్‌లో, భారీ కథతోనే గౌతమ్ ఈ సినిమా తీస్తున్నట్లు కనిపిస్తోంది. టీజర్లో విజువల్స్, మ్యూజిక్, ఎలివేషన్ అన్నీ కూడా అదిరిపోయాయి.

ఐతే అంతా బాగున్నా విజయ్ ఇలాంటి కథలో కొంచెం ఆడ్‌గా ఉన్నాడు అనే ఫీడ్ బ్యాక్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు. టీజర్ ప్రారంభం, దాని నేపథ్యం అన్నీ కూడా ఒక వింటేజ్ ఫీల్ తీసుకొచ్చాయి. అలాగే ఇందులో వీర లెవెల్లో హీరోయిజం, ఎలివేషన్ ఉన్నట్లున్నాయి. కానీ విజయ్ చాలా మోడర్న్‌గా కనిపిస్తాడు.

అతను నవతరానికి ప్రతినిధి. అతను ఎక్కువగా రియలిస్టిక్ టచ్ ఉన్న పాత్రలే చేశాడు. అతను ఎక్కువగా కమర్షియల్ టచ్ ఉన్న, హై లెవెల్ హీరోయిజం-ఎలివేషన్లు ఉన్న సినిమాలు చేసింది లేదు. అందువల్ల ఇలాంటి కథలో అతణ్ని చూడడం ఆడ్‌గా అనిపించి ఉండొచ్చు. ఐతే విజయ్ ఎంత గొప్ప పెర్ఫామరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘అర్జున్ రెడ్డి’లో అంత అగ్రెసివ్ క్యారెక్టర్ చేసి.. ‘గీత గోవిందం’లో కొంచెం పిరికితనం ఉన్న సగటు అబ్బాయిలా మెప్పించడం తనకే చెల్లింది. ‘కింగ్‌డమ్’ లాంటి మాస్ టచ్, ఎలివేషన్లు ఉన్న కమర్షియల్ సినిమాలో నటించి మెప్పించడం విజయ్‌కి సవాలే కానీ.. తనలోని పెర్ఫామర్ ఈ సవాలును ఛేదించగలడనే అభిమానులు భావిస్తున్నారు.