అలాంటి వాటికి మాత్రమే రిస్క్ చేయమంటున్న రౌడీ హీరో
ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫర్వాలేదనిపించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
By: Tupaki Desk | 14 March 2025 4:38 PM ISTఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫర్వాలేదనిపించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్‌డమ్ సినిమా చేస్తున్న విజయ్ ఆ మూవీతో ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. కింగ్‌డమ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, విజయ్ రీసెంట్ గా మేడ్చల్ దగ్గర్లోని ఓ యూనివర్సిటీ యానవర్శరీకు సెలబ్రిటీ గెస్టు గా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా విజయ్ అక్కడి విద్యార్థులతో కలిసి సందడి చేశాడు. యూనివర్సిటీ లోని స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఫోటోలు దిగి అందరినీ అలరించాడు. ఆ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు విద్యార్థుల్ని ఆలోచింపచేసేలా ఉన్నాయి. కాలేజ్ లైఫ్ లో చేసిన రిస్క్ లు తలచుకుంటుంటే ఇప్పుడు భయమేస్తుందని విజయ్ అన్నాడు.
అప్పట్లో సరదాకి ఫాస్ట్ గా బైక్స్ నడపడం, కార్లు నడపడం, అడ్వెంచర్లు చేయడం తలచుకుంటుంటేనే భయమేస్తుందని, ఆ రోజు ఏదైనా జరిగి ఉంటే ఏంటనిపిస్తూ ఉంటుందని విజయ్ అన్నాడు. అప్పుడేమైనా అయుంటే హీరోగా ఎంతోమంది ప్రేమను పొందే అవకాశాన్ని కోల్పోయేవాడినంటూ విజయ్ తన కాలేజ్ లైఫ్ ను గుర్తు చేసుకున్నాడు.
జీవితంలో మనమెన్నో రిస్కులు చేస్తాం. చేస్తున్నప్పుడు అన్నీ బాగానే అనిపిస్తాయి కానీ ఐదేళ్ల తర్వాత వాటిని గుర్తు చేసుకుంటే చాలా భయమేస్తుందని, లైఫ్ లో సెటిల్ అవడానికి టార్గెట్ పెట్టుకోవాలని, ఆ టార్గెట్ కోసం రిస్క్ చేయాలి తప్పించి, మిగిలిన వేటి కోసం ఎలాంటి రిస్క్‌లు చేయకూడదని, రిస్క్ చేసి జీవితాన్ని కోల్పోవద్దని విజయ్ స్టూడెంట్స్ కు సూచించాడు.