Begin typing your search above and press return to search.

వరదబాధితులకి అండగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్

బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

By:  Tupaki Desk   |   6 Sep 2024 10:33 AM GMT
వరదబాధితులకి అండగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్
X

తెలుగు రాష్ట్రాలలో తుఫాన్ వరదల ప్రభావంతో ఖమ్మం, కృష్ణా జిల్లాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా విజయవాడలో అయితే చాలా ప్రాంతాలు నీటమునిగాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతోంది. అలాగే సెలబ్రెటీలు చాలా మంది ముందుకొచ్చి ఎవరికి తోచిన స్థాయిలో వారు విరాళాలు ఇస్తున్నారు. కొంతమంది లక్షల్లో విరాళం ఇస్తే మరికొంతమంది కోట్ల రూపాయిలు విరాళాలుగా వరద బాధితులకి కోసం ప్రభుత్వాలకి ఇచ్చారు.

ఇదిలా ఉంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సైతం ఇలాంటి విపత్తుల వేళ తన గొప్ప మనసు చాటుకుంటారు. కరోనా సమయంలో ఎంతో మంది అభాగ్యులకి విజయ్ దేవరకొండ సాయంగా నిలబడ్డారు. అలాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు చేశారు. మెగా అభిమానులు, జనసైనికులు తెలుగు రాష్ట్రాలలో వరదబాధితుల సహాయక కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారు.

అలాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా విజయవాడలో వరద బాధితులకి తమవంతు అండగా నిలబడ్డారు. సుమారు 800 మందికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేసి వారి గొప్ప మనసు చాటుకున్నారు. ఫుడ్ ప్రిపేర్ చేసి నీట మునిగి ఉన్న కాలనీలకి వెళ్లి మంచినీళ్ల బాటిల్స్ అలాగే ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చారు. దేవరకొండ ఫ్యాన్స్ చేసిన ఈ పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.

దేవరకొండ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలలో ఫ్యాన్స్ కి సపోర్ట్ గా నిలుస్తున్నాడు. విజయ్ ఫ్యాన్స్ ఫుడ్ డిస్ట్రబ్యూట్ చేస్తోన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇలాగే అందరి హీరోల అభిమానులు కూడా వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలలో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. VD12 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. మరో మూడు సినిమాలు విజయ్ దేవరకొండ లైన్ అప్ లో ఉన్నాయి. వాటిలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మూవీ ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉందంట.