విజయ్ మహానాడు సభలో ఫ్యాన్స్ బీభత్సం!
అదే సమయంలో మీటింగ్ తర్వాత వేదిక వద్ద అభిమానులు బీభత్సం సృష్టించిన దృశ్యాలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 29 Oct 2024 9:15 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో, సొంతంగా 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పార్టీని స్థాపించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీ తొలి మహానాడు సభను నిర్వహించారు. విల్లుపురం జిల్లాలోని విక్రవాండి సలై గ్రామంలో జరిగిన ఈ బహిరంగ సభకి.. భారీ సంఖ్యలో మద్దతుదారులు అభిమానులు తరలివచ్చారు. విజయ్ పవర్ ఫుల్ పొలిటికల్ స్పీచ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో మీటింగ్ తర్వాత వేదిక వద్ద అభిమానులు బీభత్సం సృష్టించిన దృశ్యాలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
విజయ్ మెగా పొలిటికల్ మీటింగ్ ముగిసిన తర్వాత, అక్కడ పరిస్థితులకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. సభా వేదిక వద్ద వేలాది విరిగిన కుర్చీలు, దెబ్బతిన్న బారికేడ్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న ఇతర వ్యర్థాలను మనం ఈ వీడియోలలో చూడొచ్చు. ఏదైనా పెద్ద పబ్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు, ఎంతో కొంత డామేజ్ జరగడం మామూలే. కానీ ఇక్కడ టీవీకే మీటింగ్ లో జరిగిన డ్యామేజ్ చూస్తుంటే.. అక్కడ ఆయన అభిమానులు, పార్టీ మద్దతుదారులు బీభత్సం సృష్టించినట్లు అనిపిస్తోంది. నిర్వాహకులకు చాలా మొత్తంలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
తమ అభిమాన హీరో తమిళనాడు రాష్ట్రానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నప్పుడు అభిమానులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో హీరో విజయ్ ముందడుగులు వేస్తున్నప్పుడు.. ఆయన మద్దతుదారులు తమ నాయకుడికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాధ్యతాయుతంగా మెలగాలి. వారు చేసే పనులు ఆయన విలువను పెంచేలా కానీ, తగ్గించకూడదు. సినిమా ఈవెంట్లలో చేసినట్లు ఇలా కుర్చీలు బారికేడ్లు విరగ్గొట్టడం సరైంది కాదు. ఇలాంటివి మళ్ళీ జరిగితే విజయ్ మీద, ఆ పార్టీ మీద జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది.
ఇకపోతే విజయ్ మహా సభకు లక్ష మందికి పైగా హాజరయ్యారని అంచనా వేస్తున్నారు. ఈ మీటింగ్ కు వస్తూ ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. బైక్ ప్రమాదంలో ఒకరు చనిపోతే, కదులుతున్న రైలు నుంచి దూకి మరో వ్యక్తి మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఇక మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సభలో చాలామంది డీహైడ్రేషన్ కు గురయ్యారు. వారి కోసం 11 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసారు. క్రిటికల్ పేషెంట్‌లను అంబులెన్స్ లలో ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
ఇదిలా ఉంటే విజయ్ తన ఫస్ట్ పొలిటికల్ స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని.. తమిళ గడ్డకు ఇవి రెండు కళ్లులాంటివని విజయ్ పేర్కొన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే తమ భావజాలం అని, వాటి ఆధారంగానే పని చేస్తామని ప్రకటించారు. రాజకీయాల్లో సక్సెస్, ఫెయిల్యూర్ స్టోరీలు చదివాక.. తన కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై విశ్వాసంతో రాజకీయాల్లోకి వచ్చి మీ ముందు నిలబడ్డానని విజయ్ ఉద్వేగంగా మాట్లాడారు. ఆంధ్ర తమిళనాడులు రాజకీయాలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్, ఎంజీఆర్ కూడా సినిమాల నుంచి వచ్చినవారేనని గుర్తు చేసారు.