దళపతి రాజకీయారంగేట్రం ముందు శకునం!
అయితే ఇవన్నీ ఇప్పుడు దళపతి విజయ్ పాఠాలుగా మలుచుకుని కొత్త ప్లాన్ తో రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారట.
By: Tupaki Desk | 8 Sep 2024 12:30 PM GMTసినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. ఈ విషయాన్ని చాలామంది సినీతారలు రాజకీయాల్లోకి వెళ్లాక తెలుసుకున్నారు. ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత వంటి ప్రముఖులు ఒక వేవ్ లాంటి వారు. వారికి సినిమాల్లోను, రాజకీయాల్లోను ఎదురే లేకుండా కొనసాగారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. అన్నివేళలా అది కుదరదు. శివాజీ గణేషన్, విజయ్ కాంత్, చిరంజీవి, రజనీకాంత్, పవన్ కల్యాణ్, కమల్ హాసన్ .. ఇంకా చాలామంది స్టార్లు దీనిని నిరూపించారు.
రాజకీయాల్లో ఎత్తుగడలు ముఖ్యం. ప్రతి హీరోకి రాజకీయాల్లోకి వెళ్లే సమయాన్ని బట్టి అది మారుతుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లినప్పటి పరిస్థితి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు లేదు. ప్రజారాజ్యం స్థాపించినప్పటికి కళాకారుడైన చిరంజీవి సీఎం కావాలని ప్రజలు కోరుకోలేదు. పవన్ కల్యాణ్ జనసేన విషయంలోను ఇదే నిజమైంది. ఇక విజయ్ కాంత్ లాంటి స్టార్ తమిళనాడు రాజకీయాల్లో ఎదగడం కోసం చాలా పోరాడాల్సి వచ్చింది. పొత్తులతోనే ఆయన సక్సెసయ్యాడు కానీ సోలోగా కాదు.
అయితే ఇవన్నీ ఇప్పుడు దళపతి విజయ్ పాఠాలుగా మలుచుకుని కొత్త ప్లాన్ తో రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారట. అతడు 2026లో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తారు. దీనికోసం సొంత పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. గ్రౌండ్ లెవల్లో దీనిపై పని చేసేందుకు `ది గోట్` రిలీజ్ తర్వాత పూర్తిగా పార్టీ కార్యకర్తలతో నిమగ్నమై ఉంటారని ప్రచారమైంది.
అయితే సరిగ్గా విజయ్ రాజకీయాల్లో ప్రవేశించే ముందు ఒక మంచి హిట్టు అందుకుని ఉంటే బావుండేదని గోట్ ఫలితం చూసినవారు అంటున్నారు. ది గోట్ భారీ అంచనాల నడుమ విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. తమిళనాడులోను ఈ సినిమా ప్రదర్శన ఆశించినంత లేదని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇక ఇరుగు పొరుగున అసలే బజ్ లేకుండా పోయింది. దీంతో రాజకీయాల్లోకి వెళ్లే ముందు మంచి హిట్టు వస్తే బావుండేదని మాట్లాడుకుంటున్నారు. అయితే దేనిలో అయినా పాజిటివ్ కోణం కూడా చూడాలి.
తన భారీ సినిమా ఫ్లాపైంది కాబట్టి విజయ్ కి ఇప్పుడు రాజకీయాల్లో బాధ్యత, గెలుపు అవసరం తెలిసొచ్చి ఉంటాయి. అందువల్ల అతడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. కొత్త రంగంలో మరింత బాధ్యతగా పని చేసి గెలుపు గుర్రం ఎక్కాలనుకుంటాడు. అతడు జనసేనాని పవన్ కల్యాణ్ కంటే తెలివైన ఎత్తుగడలతో ముందుకు వెళ్లగలగాలి. పవన్ మొదటి సారి తప్పు చేసినా రెండోసారి అలా చేయలేదు. పొత్తులతో తెలివిగా ప్రత్యర్థులను చిత్తు చేసారు. విజయ్ కూడా ఏదైనా సమయానుకూలమైన ఎత్తుగడతో తెలివిగా గెలుపు గుర్రం ఎక్కాలని ఆకాంక్షిద్దాం. మొదటిసారి విజేతగా నిలిచి అతడు నిజమైన దళపతిని అని నిరూపించాలి.