Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్ సినిమాపై షాకిచ్చిన సేతుపతి!

ఉప్పెన సినిమాలో చేసిన విల‌న్ పాత్ర‌తో త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి తెలుగులో ఎంత ఫాలోయింగ్ సంపాదించాడో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 3:00 AM GMT
రామ్ చ‌ర‌ణ్ సినిమాపై షాకిచ్చిన సేతుపతి!
X

ఉప్పెన సినిమాలో చేసిన విల‌న్ పాత్ర‌తో త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి తెలుగులో ఎంత ఫాలోయింగ్ సంపాదించాడో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అప్ప‌టికే త‌మిళ చిత్రాల్లో అద్భుత‌మైన పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కులకు అత‌ను ప‌రిచ‌యం అయ్యాడు. కానీ ఉప్పెన మూవీతో అత‌డి ఫాలోయింగ్ వేరే లెవెల్‌కు వెళ్లిపోయింది. కేవ‌లం బుచ్చిబాబు కోస‌మే ఆ సినిమా చేసిన‌ట్లు సేతుప‌తి చెప్ప‌డం తెలిసిందే. అదే అభిమానంతో రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు చేయ‌నున్న కొత్త చిత్రంలోనూ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర చేస్తున్న‌ట్లు ఇంతకుముందు వార్త‌లు వ‌చ్చాయి.

ఈ సినిమా క‌థ అద్భుతం అంటూ సేతుప‌తి కూడా గ‌తంలో కొనియాడాడు. తాను ఆ చిత్రంలో న‌టిస్తున్న సంకేతాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడేమో చ‌ర‌ణ్‌-బుచ్చిబాబు చిత్రంలో తాను న‌టించ‌డం లేదంటూ పెద్ద షాకిచ్చాడు. త‌న కొత్త చిత్రం విడుద‌ల‌-2 ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా హైద‌రాబాద్‌లో మీడియాను క‌లిసిన సేతుప‌తి.. చ‌ర‌ణ్ సినిమా గురించి అడిగితే ఆశ్చ‌ర్య‌ప‌రిచే స‌మాధానం ఇచ్చాడు.

మీరు చ‌ర‌ణ్ సినిమాలో న‌టిస్తున్నారు క‌దా అంటే.. అదేం లేద‌ని తేల్చేశాడు సేతుప‌తి. అందుకు కార‌ణం కూడా అత‌ను వివ‌రించాడు. త‌న‌కు టైం లేద‌ని.. కొన్నిసార్లు క‌థ చాలా బాగున్నా త‌న పాత్ర స‌రిప‌డా లేక‌పోతే తాను న‌టించ‌లేనంటూ ఈ సినిమాలో ఎందుకు చేయ‌ట్లేదో వివ‌రించాడు సేతుప‌తి. ఇక నేరుగా తెలుగులో హీరోగా సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగితే.. త‌న‌కు హ‌ద్దులేమీ లేవ‌ని.. మంచి క‌థ వ‌స్తే క‌చ్చితంగా చేస్తాన‌ని సేతుప‌తి తెలిపాడు.

తెలుగు ప్రేక్ష‌కుల అభిమానం గురించి అడిగితే.. గ‌తంలో ఒక సినిమా షో చూడ్డానికి థియేట‌ర్ల‌కు వెళ్లాన‌ని.. ఇంట‌ర్వెల్లో త‌న‌ను చూసి ఫ్యాన్స్ చూపించిన ప్రేమ‌ను తాను ఎప్పుడూ మ‌రిచిపోలేన‌ని సేతుప‌తి అన్నాడు. తెలుగు ప్రేక్ష‌కుల అభిమానం చూర‌గొంటే ఆ న‌టుడు సూప‌ర్ స్టార్ అయిపోయిన‌ట్లే అని సేతుప‌తి వ్యాఖ్యానించ‌డం విశేషం. విడుద‌ల‌-2 క్లైమాక్స్‌ను ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ అద్భుతంగా రాశాడ‌ని, తీశాడ‌ని.. తెర మీద అదేంటో చూడాల‌ని అన్నాడు సేతుప‌తి.