మహారాజాకి మరో వంద కోట్లు..!
విజయ్ సేతుపతి 50వ సినిమాగా రూపొందిన మహారాజా సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ విజయాన్నిసొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 27 Dec 2024 8:36 AM GMTవిజయ్ సేతుపతి 50వ సినిమాగా రూపొందిన మహారాజా సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ విజయాన్నిసొంతం చేసుకుంది. విలక్షణ నటుడిగా పేరున్న విజయ్ సేతుపతి మరోసారి తన నటనతో మెప్పించారు. తండ్రి, కూతురు మధ్య ఉన్న సెంటిమెంట్ సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి. అలాగే సినిమా క్లైమాక్స్ సైతం సినిమాకి మంచి టాక్‌ను తెచ్చి పెట్టింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మహారాజా సినిమా ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఇండియాలో ఈ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేయగా, చైనాలో తాజాగా ఈ సినిమా విడుదల అయ్యింది.
మహారాజా సినిమాను చైనాలో దాదాపుగా 40 వేల స్క్రీన్స్‌లో విడుదల చేశారు. సినిమా మొదటి వారం రోజులు పెద్దగా సందడి చేయలేదు. దాంతో సినిమా అక్కడ జనాలకు పెద్దగా నచ్చలేదేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మెల్లమెల్లగా సినిమా జనాల్లోకి వెళ్లింది. ప్రచారం పెద్దగా చేయకుండానే మౌత్ పబ్లిసిటీతో సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. సినిమా వంద కోట్ల దిశగా దూసుకు పోతుంది. వంద కోట్ల వసూళ్లతో చైనాలో టాప్ చిత్రాల జాబితాలో మహారాజా నిలిచే అవకాశాలు ఉన్నాయి. చైనాలో ఇండియన్ మూవీ దబాంగ్ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే. ఆ స్థాయిలో మళ్లీ ఏ సినిమా వసూళ్లు రాబట్టలేదు.
విజయ్ సేతుపతి సినిమా మహారాజా సినిమా సెంటిమెంట్‌తో పాటు చైనా ప్రేక్షకులను మెప్పించే కంటెంట్‌తో ఉండటం వల్ల సినిమాకు మంచి వసూళ్లు సొంతం అవుతాయని అంతా అనుకున్నారు. అన్నట్లుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సొంతం చేసుకుంటుంది. లాంగ్ రన్‌లో మరో వంద కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు. చైనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే మరికొన్ని ఇండియన్ సినిమాలను సైతం చైనాలో విడుదల చేస్తే బాగుండేది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చైనాలోని మహారాజా కలెక్షన్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
నిథిలన్ సామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. మమతా మోహన్ దాస్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ దర్శకుడు చేసిన ఈ ప్రశ్నంకు మంచి ప్రశంసలు దక్కాయి. విజయ్ సేతుపతి నటనతో పాటు సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు రావాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మహారాజా సినిమా చైనా వసూళ్లు వంద కోట్లు దాటిన నేపథ్యంలో అక్కడ మరింతగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో అక్కడ మరింతగా వసూళ్లు దక్కుతాయా అనేది చూడాలి.