కెరీర్లో ఏదీ ప్లాన్ చేసుకోలేదంటున్న సేతుపతి
గతేడాది విడుదలై-2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆ సినిమాతో తమిళనాడులో మంచి హిట్టే అందుకున్నాడు.
By: Tupaki Desk | 18 Feb 2025 2:30 PM GMTగతేడాది విడుదలై-2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆ సినిమాతో తమిళనాడులో మంచి హిట్టే అందుకున్నాడు. కానీ తెలుగులో మాత్రం విడుదల2 మూవీకి అనుకున్నంతగా ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం సేతుపతి ఏస్, ట్రైన్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి.
రీసెంట్ గా విజయ్ సేతుపతి ఓ కాలేజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా హాజరై పలు ముఖ్య విషయాలను విద్యార్థులకు సూచించాడు. అందరూ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే మీ మనసుని టార్గెట్ గా చేసుకుని అనవసరమైన కంటెంట్ ను అందులో పోస్ట్ చేస్తారని, చూసిన ప్రతీ దాన్నీ నమ్మొద్దని, తెలివిగా ఆలోచించి ముందడుగు వేయాలని విద్యార్థులకు సూచించాడు సేతుపతి.
సమయం ఎంతో విలువైనదని, ఆ విలువైన సమయం గడిచిన తర్వాత మాత్రమే మనకు దాని విలువ తెలుస్తోందని, అందుకే కుదిరినంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోమని సూచించిన సేతుపతి, జీవితం ఎంతో అద్భుతమైనదని, దాన్ని సంతోషంగా మాత్రమే గడపమని విద్యార్థులకు సలహా ఇచ్చాడు.
ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు మీరు అజిత్ తో కలిసి ఎప్పుడు నటిస్తారని సేతుపతిని అడగ్గా దానికి సమాధానంగా, అజిత్ చాలా మంచి వ్యక్తి అని, గతంలో తామిద్దరూ కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ముందుకెళ్లలేదని, ఆయనతో కలిసి నటించే ఛాన్స్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నట్టు విజయ్ సేతుపతి తెలిపాడు.
ఇక తన కెరీర్లో ఇప్పటివరకు ఏదీ ప్లాన్ చేసుకోలేదని, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లడం మాత్రమే తనకు తెలుసని సేతుపతి తెలిపాడు. గతేడాది సేతుపతి తన 50వ సినిమాగా మహారాజా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.