బాలేని సినిమాను ధోని నిలబెడతాడా?
తమిళంలో ఒకప్పుడు ఎంత వైవిధ్యమైన సినిమాలు వచ్చేవో.. అవి అక్కడి ప్రేక్షకులనే కాక తెలుగు వాళ్లను కూడా ఎంతగా ఆకట్టుకునేవో, ఆశ్చర్యపరిచేవో తెలిసిందే.
By: Tupaki Desk | 6 Sep 2024 7:30 PM GMTతమిళంలో ఒకప్పుడు ఎంత వైవిధ్యమైన సినిమాలు వచ్చేవో.. అవి అక్కడి ప్రేక్షకులనే కాక తెలుగు వాళ్లను కూడా ఎంతగా ఆకట్టుకునేవో, ఆశ్చర్యపరిచేవో తెలిసిందే. కానీ గత పదేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయింది. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసిన శంకర్, మురుగదాస్ లాంటి దర్శకులు కూడా టచ్ కోల్పోయి తమ స్థాయికి ఏమాత్రం తగని సినిమాలు అందిస్తున్నారు. నవతరం దర్శకుల నుంచి గొప్ప సినిమాలేవీ రావట్లేదు. ఒకప్పుడు మూస సినిమాలను నెత్తిన పెట్టుకుంటారని తెలుగు ప్రేక్షకులను ఎద్దేవా చేసేవాళ్లు తమిళ జనాలు.
కానీ ఇప్పుడు తమిళ ఆడియన్స్ అదే చేస్తున్నారు. విజయ్, అజిత్ లాంటి స్టార్లు నటించిన రొటీన్ మాస్ సినిమాలనే ఆహా ఓహో అంటూ పెద్ద హిట్లు చేస్తున్నారు. ఈ గురువారం రిలీజైన ‘గోట్’ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు పెదవి విరిచారు. రొటీన్ కథాకథనాలతో విసిగించిందా సినిమా. ఇక్కడ రివ్యూలన్నీ కూడా నెగెటివ్‌గానే వచ్చాయి.
కానీ తమిళంలో మాత్రం ‘గోట్’ మూవీని సూపర్ అనేస్తున్నారు. సోషల్ మీడియాలో పేరున్న తమిళ క్రిటిక్స్ 3, 3.5 రేటింగ్స్ ఇవ్వడం విశేషం. విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. కానీ తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. తమిళంలో కూడా తొలి రోజు జోరు చూపించిన ఈ చిత్రం.. రెండో రోజు వీక్ అయింది. ఈ సినిమాలో విజయ్ వరకు బాగానే పెర్ఫామ్ చేసినా.. ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నా.. వీక్ స్టోరీ, విసుగెత్తించే కథనం మైనస్ అయింది.
ఐతే స్క్రిప్టు మీద పెద్దగా ఫోకస్ పెట్టకుండా ఫ్యాన్స మూమెంట్స్, కొన్ని క్యామియోలతో మసి పూసి మారేడుకాయను చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకట్ ప్రభు. అందులో భాగమే త్రిషతో ఐటెం సాంగ్, శివకార్తికేయన్ క్యామియో.. అలాగే చివర్లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ నేపథ్యంలో క్లైమాక్స్ తీర్చిదిద్దడం. తమిళ జనాలకు సీఎస్కే టీం, ధోనితో ఉన్న ఎమోషనల్ బాండింగ్ వేరు. ధోని పేరు చెబితే ఊగిపోతారు. ఈ నేపథ్యంలో ధోని చివర్లో విన్నింగ్ షాట్ కొట్టిన ఓ ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో క్లైమాక్స్‌ను తీర్చిదిద్దాడు వెంకట్ ప్రభు. హీరో స్టేడియం మీద బైకులో విన్యాసాలు చేస్తుంటే బ్యాటింగ్‌కు వెళ్తున్న ధోని కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నట్లు ఒక షాట్ కూడా పెట్టారు. క్లైమాక్స్‌లో చివరి షాట్ కూడా ధోనికి ఎలివేషన్ ఇస్తూ సాగింది. ఐతే కంటెంట్ వీక్‌గా ఉన్నపుడే ఇలాంటి ఆకర్షణలు జోడిస్తారని.. బాలేని సినిమాను ధోని కూడా నిలబెట్టడం కష్టమే అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.