ఏడాదిలో హీరో పారితోషికం 100 కోట్ల హైక్
2023 సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి వరకూ మారిన పారితోషికం రేంజును ఇది సూచిస్తుంది
By: Tupaki Desk | 29 Aug 2024 7:30 PM GMT120 కోట్లు.. 150 కోట్లు.. 175 కోట్లు.. 220 కోట్లు.. ఇదేమైనా సెన్సెక్స్ గ్రాఫ్ అనుకుంటున్నారా? చక్కగా ఒక పద్ధతి ప్రకారం పెరుగుదల.. ఇలాంటి స్టాక్ లో పెట్టుబడులు పెడితే లాభాలు ఖాయమని భావిస్తున్నారా? అయితే ఈ గణాంకాలు చూసి మోసపోకండి.
ఇవన్నీ ఒక స్టార్ హీరో పారితోషికంలో ఎదుగుదలకు సంబంధించిన లెక్కలు. 2023 సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి వరకూ మారిన పారితోషికం రేంజును ఇది సూచిస్తుంది. అంటే ఏడాది కాలంలో ఎంతటి పెరుగుదల ఉందో మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఐదారు నెలల్లో సంతకాలు చేసిన సినిమాలకు అతడి డిమాండ్ ఎలా ఉందో అంచనా వేయొచ్చు.
ఇదంతా మరెవరి గురించో కాదు. ది గ్రేట్ విజయ్ గురించే. అతడు వారిసు (వారసుడు-2023) చిత్రంలో నటించినందుకు నిర్మాత దిల్ రాజు నుంచి అందుకున్న పారితోషికం 120 కోట్లు. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడు నటిస్తున్న సినిమాకి ఏకంగా 175 కోట్లు తీసుకుంటున్నాడు. 50 కోట్లు ఒకేసారి పెంచాడు. ఆ సినిమా టైటిల్ `ది గోట్`. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతలోనే రాజకీయాల్లోకి వెళుతూ నటించబోతున్న చిట్టచివరి సినిమా గురించి చర్చ సాగుతోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వచ్చే ఏడాది నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే యోచనలో దళపతి విజయ్ ఉన్నాడు.
అయితే విజయ్ చివరి సినిమాని నిర్మించేందుకు ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు రేసులో ఉన్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. దాదాపు 150 కోట్లు పారితోషికంగా చెల్లించేందుకు దానయ్య అండ్ కో సిద్ధమయ్యారని ప్రచారం సాగుతోంది. కానీ దళపతి విజయ్ డివివి ఎంటర్‌టైన్ మెంట్స్ కి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సరికదా.. అతడు నటించే భారీ చిత్రం కోసం కెవిఎన్ ప్రొడక్షన్స్ ఏకంగా 220 కోట్లు వసూలు చేస్తున్నాడని తెలిసింది. ఇటీవలే ఈ చిత్రానికి విజయ్ సంతకం చేసారట. హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి అక్టోబర్‌లో లాంచ్ చేయనున్నారు. 2025 వేసవిలో విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ కాల్షీట్లు కేటాయించే పనిలో ఉన్నారు. తదుపరి రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెడతారని తెలిసింది.
అయితే కేవలం ఏడాదిన్నరలో ఇంత పెద్ద హైక్ ఏ హీరోకి లేనే లేదు. 120 కోట్ల నుంచి 220 కోట్లకు అతడి పారితోషికం పెరగడానికి కేవలం ఏడాదిన్నర సమయం సరిపోయింది. 18నెలల్లోనే 100 కోట్లు పెంచిన హీరోగా దళపతి విజయ్ రికార్డులకెక్కాడు.