మలైకాని వేధించకండి ప్లీజ్..!
బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య ఘటన బాలీవుడ్ లో సంచలనంగా మారింది
By: Tupaki Desk | 13 Sep 2024 7:27 AM GMTబాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య ఘటన బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఆయన మృతికి కారణం ఏంటి అంటూ బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సమయంలో మీడియా వారు పదే పదే మలైకా అరోరా తో మాట్లాడించేందుకు, ఆమె కుటుంబ సభ్యులను మాట్లాడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తండ్రి అంత్యక్రియలకు హాజరు అయిన సమయంలో మలైకా వెంట మీడియా పడటంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబాన్ని వదిలేయండి అంటూ మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుత సమయంలో ఆ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని మీడియా వారికి కాస్త ఒంటరితనం ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు ఇండస్ట్రీ వర్గాల వారు అన్నారు. నటుడు విజయ్ వర్మ సోషల్ మీడియా ద్వారా.. దుఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయండి, దయచేసి ఆ కుటుంబాన్ని ఇప్పుడు ప్రశ్నలు అడగడం మంచిది కాదు. వారికి అండగా నిలవాల్సిన ఈ సమయంలో వారిని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం సరైన పద్దతి కాదు అంటూ ట్వీట్ చేశాడు. మలైకా అరోరా వెంట మీడియా పడటం ను ఆయన తప్పుబట్టారు.
బాలీవుడ్ హీరో వరుణ్ దావన్ మాట్లాడుతూ... ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం మీడియాకు తగదు. ఈ సమయంలో మీరు ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా. ఒక ఫ్యామిలీ ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా వారిని వెంట పడి ప్రశ్నించడం ఎంత వరకు కరెక్ట్. కుటుంబంలో వ్యక్తి చనిపోయిన సమయంలో వారిని మీడియాలో చూపించడం ఎంత వరకు కరెక్ట్. పైగా వారికి ఈ సమయంలో కావాల్సిన పీస్ ను ఇవ్వకుండా ఇంకాస్త ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్దతి కాదు. మీడియా తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దు అంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు.
ఇంకా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇటీవల మీడియా వ్యవహరించిన తీరు ముఖ్యంగా అంత్యక్రియల సమయంలో మలైకా వెంట కొందరు కెమెరాలు పట్టుకుని వెళ్లడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీడియా వారు సెలబ్రెటీలకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎక్కడకు వెళ్లిన ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అంటూ ఒక బాలీవుడ్ స్టార్ అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి మలైకా అరోరా కి ఆమె ఫ్యామిలీకి ఇప్పుడు కాస్త ప్రశాంతత కావాలి, అనిల్ మృతి నుంచి ఆ ఫ్యామిలీ బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు మీడియా వారు వేధించొద్దు అంటున్నారు.