Begin typing your search above and press return to search.

అదెట్టా! విజ‌య్‌కాంత్ మ‌ళ్లీ తెర‌పైకి!!

ద‌ళ‌పతి విజ‌య్ న‌టిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ది గోట్) చాలా కాలంగా మీడియా హెడ్‌లైన్స్ లోకొస్తోంది

By:  Tupaki Desk   |   15 Jun 2024 4:18 AM GMT
అదెట్టా! విజ‌య్‌కాంత్ మ‌ళ్లీ తెర‌పైకి!!
X

ద‌ళ‌పతి విజ‌య్ న‌టిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ది గోట్) చాలా కాలంగా మీడియా హెడ్‌లైన్స్ లోకొస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. త‌మిళ మీడియా తాజా క‌థ‌నం ప్రకారం.. ప్రముఖ నటుడు, దివంగ‌త రాజ‌కీయ‌నాయ‌కుడు విజయకాంత్‌కు నివాళులర్పించేందుకు మేకర్స్ ఈ చిత్రంలో ఒక నిమిషం పాటు అత‌డు న‌టించిన‌ సినిమా సన్నివేశాలను జోడించారని తెలుస్తోంది.

దివంగత నటుడు, నాయ‌కుడు విజ‌య్ కాంత్ కి నివాళిగా గోట్ చిత్ర బృందం AI సాంకేతికతలో ఆయ‌న‌ను రీక్రియేట్ చేసి ఉపయోగించినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. చిత్ర‌ బృందం విజయకాంత్ భార్య ప్రేమలత విజయకాంత్ నుండి అనుమతి పొందింది. అలాగే ప్రీ క్లైమాక్స్ పార్టీలో విజయకాంత్ సన్నివేశాన్ని ఆయ‌న భార్యకు చూపించారు. ఆ దృశ్యాలు చూసి ప్రేమలత విజయకాంత్ చలించిపోయారని తెలుస్తోంది. దీనితో పాటు AI సాంకేతికత ద్వారా సృజించిన‌ విజయకాంత్ సన్నివేశాల మొత్తం ఎన్ని నిమిషాల నిడివితో ఉండ‌నున్నాయో కూడా వెల్ల‌డైంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయకాంత్ తనయుడు వి.విజయ ప్రభాకరన్ మాట్లాడుతూ-''సినిమాలో విజయకాంత్ సన్నివేశం మొత్తం ఒక నిమిషం పాటు సాగుతుంద''ని అన్నారు. అంతకుముందు నిర్మాత అర్చన కల్పతి అందించిన వివ‌రం ప్రకారం.. అవతార్ కి ప‌ని చేసిన అద్భుతమైన సాంకేతిక బృందంతో కలిసి ప‌ని చేస్తున్నామ‌ని, VFX పని కూడా ప్రారంభమైందని తెలిసింది. దీనిని బ‌ట్టి ఈ సినిమా కోసం అత్యంత భారీ బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నార‌ని భావించాల్సి ఉంది. భారతీయ సినిమాని పునర్నిర్వచించే ఒక విజువ‌ల్ వండ‌ర్ గా గోట్ నిల‌వ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. హాలీవుడ్ VFX కంపెనీని ఇన్వాల్వ్ చేయాలనే ఆలోచన ఇప్పటికే ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో భారీగా VFX సన్నివేశాలను వీక్షించే వీలుంద‌ని, సృజనాత్మకతకు పరిమితులు లేని విశ్వంలోకి వీక్షకులను తీసుకువెళుతుందని చిత్ర‌బృందం పేర్కొంది.

GOAT కాన్సెప్ట్ వైవిధ్య‌మైన‌ది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా క‌థాంశంతో రూపొందుతోంది. ఇందులో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని టీమ్ చెబుతోంది. విజయ్ రెండు పాత్రలను పోషించాడు. మధ్య వయస్కుడిగా.. యువకుడిగా క‌నిపిస్తాడు. ఈ చిత్రాన్ని AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. అర్చన కల్పాతి, కల్పాతి S అఘోరమ్, కల్పాతి S గణేష్, కల్పాతి S సురేష్ సహ నిర్మాత‌లు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి క‌థానాయిక‌గా నటిస్తుండగా, ప్రముఖ నటులు జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ త‌దిత‌రులు స‌హాయ‌క పాత్ర‌ల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 5న ఘ‌నంగా విడుద‌ల కానుంది.