కూతురు చనిపోయిన 10రోజులకే ఎంత ధైర్యం?
తన కుమార్తె మరణించిన కొద్ది రోజులకే విజయ్ తన చిత్రం 'రథం' ప్రచారానికి వచ్చాడు. ఈరోజు ఆయన సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
By: Tupaki Desk | 29 Sep 2023 3:15 AM GMTతమిళ హీరో విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఇటీవలే బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 17ఏళ్ల కూతురి మరణం గురించి తెలుసుకుని విజయ్ కుప్పకూలిపోయాడు. తన కూతురితో పాటు తాను కూడా మరణించానని అతడు సుదీర్ఘ నోట్ లో ఆవేదనను వెలిబుచ్చాడు. కుట్రలు కుతంత్రాలు అసమానతల ప్రపంచానికి దూరంగా తన కూతురు వెళ్లిందని ఆ నివేదన లేఖలో రాసాడు.
కుమార్తె మృతితో వ్యక్తిగతంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన విజయ్ ఆంటోని ఇప్పట్లో కోలుకుని సినిమాలు చేయగలడా? అని అంతా సందేహించారు. అయితే అతడి గుండె ధైర్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన కుమార్తె మరణం వ్యక్తిగత అంశం. అయినా అది వృత్తిగతంగా ప్రభావం చూపకుండా మ్యానేజ్ చేయడం షాకిస్తోంది. తన కుమార్తె మరణించిన కొద్ది రోజులకే విజయ్ తన చిత్రం 'రథం' ప్రచారానికి వచ్చాడు. ఈరోజు ఆయన సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన తన కూతురు మీరాను కోల్పోయిన విజయ్ 10 రోజుల తర్వాత తన చిత్రాన్ని ప్రమోట్ చేయడం ప్రారంభించాడు. ఇంత పెద్ద నష్టం కష్టంలోను వృత్తిపరమైన నిబద్ధతను పాటించాలనుకోవడానికి చాలా ధైర్యం అవసరం. అతడు తన నిర్మాత శ్రేయస్సును కోరుకున్నాడు.
బిచ్చగాడు సహా పలు విజయవంతమైన చిత్రాల్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విజయ్ ఆంటోని నిర్మాతగాను పలు చిత్రాల్ని తెరకెక్కించారు. ప్రతిసారీ హైదరాబాద్ లో ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు అతడు సినీజర్నలిస్టులతో ఎంతో స్నేహంగా కలిసిపోయేవాడు. అతడి ఒదిగి ఉండే స్వభావాన్ని తెలుగు జర్నలిస్టులు ఎంతగానో అభిమానిస్తారు. విజయ్ ఆంటోనికి తెలుగు మీడియా సహకారం ఎప్పుడూ ఉంది.
రథం కథాకమామీషు ఇదీ:
రథం తమిళ-తెలుగు ద్విభాషా క్రైమ్ థ్రిల్లర్. తమిళ్ పదం వంటి పేరడీ చిత్రాలతో గుర్తింపు పొందిన సి.ఎస్.అముదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ నిర్మించింది. అక్టోబర్ 6న సినిమా విడుదలవుతోంది. విజయ్ ఆంటోని, నందితా శ్వేత, మహిమా నంబియార్, రమ్య నంబీషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రథం' కథాంశం ప్రకారం.. అతను తన జీవితంలో చాలా సవాళ్లను పోరాటాలను ఎదుర్కొనే యువకుడి పాత్రను పోషించాడు. ఒక నిర్దిష్ట సంఘటన తర్వాత ఆ ఘటనకు కారకులైన వారిని పట్టుకునే అధికారి జర్నీ ఈ చిత్రం. హత్య, మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్‌తో కూడిన సినిమా ఇది. అవినీతి, మీడియా అవకతవకలు, ప్రజల ఆగ్రహం వంటి కొన్ని సామాజిక సమస్యల గురించి కూడా ఇందులో చూపిస్తున్నారు. 'నిజం మిమ్మల్ని విడుదల చేస్తుంది' అనే ఆసక్తికర ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం వస్తోంది. ఇది న్యాయం, సత్యం, విముక్తి వంటి అంశాలతో రక్తి కట్టించనుంది.
విజయ్ ఆంటోని పిచైక్కారన్ (బిచ్చగాడు), సైతాన్, కొడియిల్ ఒరువన్ వంటి కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. కెరీర్ పరంగా నటుడు కం సంగీత స్వరకర్తగా రాణించాడు. అతను తన బహుముఖ పాత్రలు అసాధారణ ఎంపికలతోను పాపులరయ్యాడు. '