Begin typing your search above and press return to search.

బ్రిటన్ కు జగన్.. యూరోప్ కు విజయసాయి..!

విదేశాలకు వెళ్లేందుకు వీలుగా తమకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైసీపీకి చెందిన కీలక నేతలు ఇద్దరు సీబీఐ కోర్టును ఆశ్రయించారు

By:  Tupaki Desk   |   21 Aug 2024 4:20 AM GMT
బ్రిటన్ కు జగన్.. యూరోప్ కు విజయసాయి..!
X

విదేశాలకు వెళ్లేందుకు వీలుగా తమకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైసీపీకి చెందిన కీలక నేతలు ఇద్దరు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను యూకేకు వెళ్లాలని కోరుతూ.. అందుకు తగిన అనుమతులు కోర్టు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో వైసీపీలో కీలక నేతల్లో ముఖ్యులు విజయసాయి రెడ్డి కూడా తాను యూరోప్ వెళ్లేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

యూకేలో ఉన్న తన కుమార్తెను కలిసేందుకు వీలుగా సెప్టెంబరు మొదటి వారంలో తాను యూకేకు వెళ్లాలనుకుంటున్న విషయాన్ని జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో ఉన్న ఆయన.. విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

ఈ ఉదంతం ఇలా ఉంటే.. దీనికి ముందు అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి సైతం తాను యూరోప్ కు వెళ్లేందుకు వీలుగా వచ్చే ఆర్నెల్లలో అరవై రోజులు టూర్ కు ఓకే చెప్పాలని కోరుతూ సీబీఐ కోర్టును కోరారు. సాయిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గతంలోనూ విదేశీలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇలా అనుమతులు ఇస్తూ ఉంటే విచారణ జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేసు విచారణ ముందుకు సాగటం లేదని.. అనుమతి ఇవ్వొద్దని కోరారు. ఈ నెల 30 వరకు ఈ అంశంపై విచారణకు వాయిదా వేస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు.