Begin typing your search above and press return to search.

సుక్కుతో విజయ్ సినిమా? జరిగే పనేనా?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 May 2024 4:34 AM GMT
సుక్కుతో విజయ్ సినిమా? జరిగే పనేనా?
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. కానీ విజయ్.. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టారు.

దీంతోపాటు రెండు చిత్రాలు కూడా విజయ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో రాజాగారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలాతో రూరల్ యాక్షన్ డ్రామా చేయనున్నారు. తనకు ఇప్పటికే టాక్సీవాలాతో మంచి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ తో పీరియాడిక్ డ్రామా కోసం వర్క్ చేయనున్నారు. ఈ రెండు కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం. ఇప్పుడు విజయ్ మరో సినిమాకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది.

డైరెక్టర్ సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబోలో మూడేళ్ల క్రితం ఓ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం గుర్తుందా? ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ.. ఈ మూవీని ప్రకటించి 2022లో పట్టాలెక్కించేందుకు సన్నాహాలు కూడా చేసింది. కానీ సెట్స్ పైకి వెళ్లలేదు. అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత ఆ సినిమా ఉంటుందేమోనని అంతా అనుకున్నారు. ఇంతలో సుకుమార్.. చరణ్ మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఇప్పుడు విజయ్ బ్రదర్ ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమా వస్తోంది.

అయితే గం గం గణేశా మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ్- సుకుమార్ కాంబోలో సినిమాపై నిర్మాత కారుమంచి స్పందించారు. ప్రస్తుతం విజయ్, సుకుమార్ బిజీగా ఉన్నారని చెప్పారు. పుష్ప-2 తర్వాత సుకుమార్ చరణ్ మూవీ చేయనున్నారని తెలిపారు. అది పూర్తయిన తర్వాత విజయ్ తో సినిమా ఉంటుందని వెల్లడించారు. ఆ ప్రాజెక్ట్ తప్పక ఉంటుందని చెప్పి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు.

అంతవరకు బాగానే ఉంది కానీ.. పుష్ప-2ను కొన్నేళ్లుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇక చరణ్ సినిమా కూడా రెండేళ్ల పాటు సుక్కు షూటింగ్ జరపనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంటే 2026 వచ్చేస్తుంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఎవరూ గెస్ చేయలేం. సుకుమార్ భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తారు. అందుకు ఫాల్కన్ క్రియేషన్స్ సంస్ధ సిద్ధంగా ఉందా లేదా అనేది తెలియదు. మొత్తానికి విజయ్- సుకుమార్ ప్రాజెక్ట్ పట్టలెక్కుతుందో లేదో వేచి చూడాలి.