బాణీయే కాదు హీరో లుక్స్‌పైనా సెటైర్లు
అంతేకాదు.. ఈ పాటల్లో చూపించిన విజయ్ లుక్స్ పైనా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.
By: Tupaki Desk | 4 Aug 2024 6:25 AM GMTదళపతి విజయ్ లాంటి అగ్ర హీరో సినిమాకి యువన్ శంకర్ రాజా లాంటి ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు పని చేస్తున్నాడంటే మ్యూజిక్ ఆల్బమ్‌పై చాలా అంచనాలుంటాయి. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో యువన్ ఫెయిలయ్యాడా? అంటే అవుననే విమర్శిస్తున్నారు క్రిటిక్స్. అంతేకాదు.. ఈ పాటల్లో చూపించిన విజయ్ లుక్స్ పైనా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.
తాజాగా విజయ్ నటించిన `ది గోట్`(వెంకట్ ప్రభు దర్శకుడు) ఆల్బమ్ పై క్రిటిక్స్ తమదైన శైలిలో చెణుకులు విసురుతున్నారు. ఇంతకుముందే స్పార్క్ అంటూ ఆల్బమ్ నుంచి మూడో పాటను రిలీజ్ చేసారు. ఈ పాట కోసం యువన్ ఎంచుకున్న బాణీ పూర్తిగా ఫెయిలైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వరమాంత్రికుడు ఇళయరాజా వారసుడి వద్ద క్రియేటివిటీ ఏమైంది? అన్న విమర్శలు చెలరేగుతున్నాయి. స్పార్క్ పాట పరమ రొటీన్ గా ఉందని కూడా విమర్శిస్తున్నారు.
ఇంతకుముందు ఎక్కడో వినేసినట్టే ఉంది! అనిపించే బాణీలు ఇవ్వడంలో ఎస్.ఎస్.థమన్ కి ఒక రికార్డ్ ఉంది. తమ పాటల బాణీలను రిపీటెడ్ గా వినిపించే వారిలో థమన్, దేవీశ్రీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అగ్రశ్రేణి సంగీత దర్శకులే అయినా కానీ.... వారి నుంచి రొటీన్ ట్యూన్లను నెటిజనులు ఎప్పటికప్పుడు తూర్పారబడుతుంటారు.
అయితే తమిళంలో ఉన్న మెరికల్లాంటి అనిరుధ్ రవిచందర్, యువన్ శంకర్ రాజా వంటి వారిపైనా ఇలాంటి విమర్శలు వెల్లువెత్తడం నిజంగా హాస్యాస్పదం. సంగీతంలో పోటుగాళ్లు! అని చెప్పుకునే వీళ్ల అభిమానులే ఇప్పుడు రిపీట్ ట్యూన్స్ ని అంగీకరించలేకపోతున్నారు. `ది గోట్` ఆల్బమ్ తీవ్రంగా నిరాశపరచడంతో యువన్ శంకర్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇళయరాజా మాదిరిగా ఎప్పటికప్పుడు క్రియేటివిటీకి పదును పెడుతూ అతడు ట్రెండీ ట్యూన్స్ ఇవ్వాలని కూడా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరోవైపు దళపతి విజయ్ లుక్ విషయంలోను అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. `స్పార్క్ ..` పాటలో యానిమేటెడ్ విజువల్స్ ని మిక్స్ చేసి విజయ్ ని యంగ్ గా చూపించాలనే తాపత్రయం కనిపించింది. కానీ 50 ప్లస్ విజయ్ ని 25 లోకి మార్చడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అతడు ఎంత ఎనర్జిటిక్ స్టెప్పులు వేసినా కానీ, మారిన రూపంలో లోపాన్ని అభిమానులు కనిపెట్టేసారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి సీనియర్ హీరోలను ఇంకా యువకుల్లా చూపించాలనే తపన కూడా ఇప్పుడు ఫలించడం లేదు. అందువల్ల వారంతా తమ వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. మారిన అల్ట్రా అప్ డేటెడ్ సమాజంలో ఇంకా 50 ప్లస్ హీరోలు యువకుల్లా కనిపించేందుకు చేసే ప్రయత్నాలు కచ్చితంగా విమర్శల పాలవ్వడం సహజం. విమర్శల్ని పాజిటివ్ గా తీసుకుని వారి ఎంపికలను మార్చుకుంటారని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.