విజయ్ రాజకీయం పవన్ లాగా? ప్రత్యేకంగానా?
ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉంది. ఈలోగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లాలి. పార్టీకి కావాల్సిన అన్నిరకాల సహకారాన్ని బిల్డ్ చేసుకోవాలి.
By: Tupaki Desk | 3 Feb 2024 1:30 PM GMTఎట్టకేలకు తలపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేసేసిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా రాజకీయాల ల్లోకి వస్తాడు? అన్న ప్రచారానికి నిన్నటి రోజున నిజం చేసాడు. 'తమిళగ వెట్రి కజగమ్' అనే పార్టీ స్థాపించి రాజకీయాల్లో తల పండిన నేతల్నే తలదన్నడానికి రెడీ అయ్యాడు. 2026 ఎన్నికలే టార్గెట్ గా తమ పార్టీ బరిలోకి దిగుతుందని క్లారిటీ ఇచ్చేసాడు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే విజయ్ రాజకీయాల్లో ఎలా కొనసాగుతాడు? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉంది. ఈలోగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లాలి. పార్టీకి కావాల్సిన అన్నిరకాల సహకారాన్ని బిల్డ్ చేసుకోవాలి. ఈ నేపథ్యం లోనే మరొక్క సినిమా పూర్తి చేసిన తర్వాత పూర్తిగా ప్రజాసంక్షేమంలోనే ఉంటానని మాటిచ్చారు. పార్టీ ప్రకటనతో పాటే తమిళనాడు ప్రజలకు ఈ వాగ్దానం చేసారు. అయితే ఈ మాట పై విజయ్ ఎంతవరకూ నిలబడతాడు? అన్నది ఆసక్తికరం.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే జనసేన పార్టీ ప్రకటించినప్పుడు ఇకపై ప్రజల మధ్యనే ఉంటా నని మాటిచ్చాడు. సినిమాలు..రాజకీయం రెండు పడవల ప్రయాణం అసాధ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆ మాటని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేకపోయారు. మళ్లీ ఆయన అనివార్య కారణాలతో మ్యాకప్ వేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సినిమాలు-రాజకీయం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉండటంతో ప్రస్తుతానికి రాజకీయాలపైనే దృష్టి పెట్టి పని చేస్తున్నారు. ఎక్కడ షూటింగ్ లు అక్కడ నిలిపేసి ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. అయితే ఈ సన్నివేశం ఎన్నికలు పూర్తయ్యే వరకే. ఆ తర్వాత మళ్లీ తాను కమిట్ అయిన సినిమాలన్నీ యధావిధిగా పూర్తి చేస్తాడు. మరి రాజకీయం..సినిమా విషయంలో విజయ్ కమిట్ మెంట్ ఎలా ఉంది? అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.
ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలకే అంకితమవుతారా? లేక పవన్ లా పరిస్థితులు బాగోలేదని మళ్లీ మ్యాకప్ వేసుకుంటారా? అన్న సందేహం విశ్లేషకుల్లో ఉంది. ఎందుకంటే రాజకీయాలు సినిమాలు బ్యాలెన్స్ చేసి సక్సెస్ అయింది అతికొద్ది మందే. ఎన్టీఆర్..జయలలితకే సాధ్యమైంది. ఆ తర్వాత అదే తరహా ప్రయత్నంలో కొంత మంది ప్రయత్నించారు గానీ నిలబడలేకపోయారు.
రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదని వెనక్కి తగ్గారు. ఈ మధ్యనే ఉదయనిధి స్టాలిన్ కూడా ఇలాంటి జర్నీ కష్టమని భావించి సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి తాత..తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రత్యర్ధి కూడా ఉదయనిధినే. ఈ నేపథ్యంలో విజయ్ జర్నీ ఎలా సాగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.