కృతితో సినిమా.. ఇక వదిలేయండన్న విజయ్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 Jun 2024 9:40 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. తన యాక్టింగ్ అండ్ సినిమాల పట్ల డెడికేషన్ తో టాలీవుడ్ లో అశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఇక వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. మూవీలో కృతి శెట్టి తండ్రిగా విజయ్ సేతుపతి అద్భుతంగా నటించి అందరినీ మెప్పించారు.
అయితే ఉప్పెన తర్వాత కోలీవుడ్ మూవీ డీఎస్ పీలో విజయ్ సేతుపతి సరసన కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని ఆ సినిమా మేకర్స్ అనుకున్నారట. అందుకు విజయ్ ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ముందు కృతికి తండ్రిగా నటించి.. మళ్లీ జోడీగా చేయడం ఇష్టం లేదని చెప్పేశారు విజయ్. దీంతో కృతిని ఎందుకు తన పక్కన హీరోయిన్ గా వద్దన్నారన్న విషయంపై ఇప్పటికే విజయ్ అనేక సార్లు తెలిపారు. ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు.
విజయ్ లేటెస్ట్ మూవీ మహారాజా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో కృతి గురించి విజయ్ కు ప్రశ్న ఎదురైంది. ఉప్పెన సమయంలో తనను తండ్రిగా భావించమని కృతికి చెప్పానని, అందుకే ఆమెకు జోడీగా నటించడం కరెక్ట్ కాదని అనిపించిందని తెలిపారు. కృతిని ముందు అడిగినా.. తన కూడా నో చెప్పేదని అన్నారు.
ఈ విషయాన్ని ఇతర యాక్టర్లతో పోల్చవద్దని విజయ్ సేతుపతి తెలిపారు. మూవీ స్టోరీకి అవసరమైతే వాళ్లు నటిస్తారని చెప్పారు. తండ్రిగా భావించమని చెప్పా కనుకే, తన పక్కన హీరోగా వద్దనుకున్నానని వెల్లడించారు. దీంట్లో ఎలాంటి గొప్ప విషయం లేదని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రశ్న తనను ఇంకా వెంటాడుతోందని, ఆ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని విజయ్ సేతుపతి అందరినీ కోరారు.
మరోవైపు, కృతి శెట్టి ఉప్పెన మూవీతో ఎలాంటి ఫేమ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ మూవీతో బేబమ్మగా అందరి మనసుల్లో నిలిచిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. వరుస అవకాశాలు అందుకుంది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన పలు సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం మనమే చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తోంది కృతి. త్వరలోనే మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.