ఇక్కడ పవర్ స్టార్ లాగే అక్కడ పవర్ స్టార్ కూడా!
దీంతో పీకే పోలిటికల్ స్ట్రాటజీ మార్చారు. ఒంటరిగా కష్టమని భావించి అటుపై వివిధ పార్టీలతో కలిసి పనిచేసారు
By: Tupaki Desk | 18 Jun 2024 12:55 PM GMTఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు. గెలిచామా? గెలిచి నిలబడ్డమా? లేదా అన్నది ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపించిన సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించిన పదేళ్లలో ఎన్నో ఆట్లు పోట్లు ఎదుర్కున్నారు. పార్టీలోకి నాయకులు రావడం...వెళ్లడం తో ప్రయాణమంతా ఒంటరిగానే సాగింది. దీంతో పీకే పోలిటికల్ స్ట్రాటజీ మార్చారు. ఒంటరిగా కష్టమని భావించి అటుపై వివిధ పార్టీలతో కలిసి పనిచేసారు.
ఈ క్రమంలో రకరకాల పార్టీలో పొత్తులు పెట్టుకోవడం..తర్వాత బయటకు రావడం చాలా కథే జరిగింది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా చంద్రబాబుకి మద్దతు తెలిపినట్లు ప్రచారంలోకి వచ్చింది. అటుపై 2019 ఎన్నికల్లో పోటీ చేసినా తన సీటు సైతం గెలవలేకపోయారు. దీంతో లాభం లేదనుకున్న పవన్ ..టీడీజీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జత కట్టడంతో గెలుపు గుర్రమెక్కారు.
కూటమి ఏర్పడకపోయి ఉంటే మళ్లీ 2019నాటి పరిస్థితే ఎదురవుతుందని పవన్ నిర్ణయించుకుని ఎంతో చాకచక్యంగా ముందుకెళ్లడంతోనే నేడు ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఎలా గెలిచాం? అన్నది కాదు.. గెలిచామా? లేదా? అన్నది ఆ రకంగా నిరూపించారు. తాజాగా తలపతి విజయ్ కూడా ఇదే మార్గంలో కనిపిస్తున్నారు. తమిళనాట తమిళ వెట్రికజగం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2026 ఎన్నికలు టార్గెట్ గా విజయ్ పనిచేస్తున్నారు.
త్వరలో తమిళనాడులో ఓ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుందని కొన్ని రోజులుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పార్టీ కార్యాలయం నుంచి ఓ లేఖ రిలీజ్ అయింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ తమిళ వెట్రి కజగం పార్టీ పోటీ చేయదు. ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ చెయ్యట్లేదు.
అలాగే ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వడం లేదు అని ప్రకటన రిలీజ్ చేసింది. పార్టీ పెట్టిన కొత్తలో జనసేన కూడా ఇలాగే వ్యవహరించింది. కాలక్రమంలో పార్టీ లో మార్పులొచ్చాయి. పార్టీ నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో ఇతర పార్టీలతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. విజయ్ పార్టీ విషయంలోనే ఇదే సన్నివేశం రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.