ట్రైలర్ టాక్ : IC 814 ది కాందహార్ హైజాక్.. గగనంలో టెన్షన్!
పైలెట్ యూనిఫాంలో ఎంత టెన్షన్ ఉంటుందో తాజాగా విడుదలైన ట్రైలర్ చెబుతోంది.
By: Tupaki Desk | 20 Aug 2024 4:55 PM GMTనటుడు విజయ్ వర్మ OTT లలో పాపులర్ స్టార్. చాలా ముఖ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లలో భాగమయ్యాడు. అనుభవ్ సిన్హా రూపొందించిన నెట్‌ఫ్లిక్స్ మినీ-సిరీస్ `IC 814: ది కాందహార్ హైజాక్`లో అతడు కీలక పాత్రను పోషించాడు. ఈ వెబ్ సిరీస్ కథను డ్రైవ్ చేసే విమాన పైలట్ గా నటించాడు. పైలెట్ యూనిఫాంలో ఎంత టెన్షన్ ఉంటుందో తాజాగా విడుదలైన ట్రైలర్ చెబుతోంది.
విమానం హైజాక్ నేపథ్యంలో సినిమా అనగానే ఇందులో చాలా టెన్షన్స్, ఎమోషన్స్ కి ఆస్కారం ఉంటుంది. ఉగ్రవాదులు లేదా దుండగుల నుంచి కొన్ని డిమాండ్లు ఉంటాయి. వాటిని పరిష్కరించే ప్రయత్నంలో కమెండో ఆపరేషన్ ఎలా సాగింది? అన్నది ఉత్కంఠగా ఉంటుంది. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా యోధ ఇదే తరహాలో విమానం హైజాక్ నేపథ్యంలో రూపొందించిన సినిమా. అంతకుముందు నాగార్జున గగనం అలాంటి ప్రయత్నమే. ఇప్పుడు విజయ్ వర్మకు అలాంటి అరుదైన అవకాశం లభించింది.
యోధ తరహాలోనే ఇది కూడా నిజ ఘటనలతో రూపొందించిన చిత్రం. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A300 హైజాక్ కి గురైనప్పుడు జరిగిన వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ సిరీస్ ను రూపొందించారు. ఇది ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 స్టోరి. ఆ విమానాన్ని సాధారణంగా IC 814 అని పిలుస్తారు. దీనినే సిరీస్ టైటిల్ గా నిర్ణయించారు. ఇది డిసెంబరు 24న నేపాల్‌లోని ఖాట్మండు నుండి భారతదేశంలోని ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్. హైజాక్ అయిన తర్వాత విమానం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో ల్యాండ్ అయ్యే ముందు అనేక ప్రదేశాలకు వెళ్లింది. విమానంలో దాదాపు 176 మంది ప్రయాణికులు ఉన్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ రెండు నిమిషాల యాభై-ఆరు సెకన్ల నిడివిని కలిగి ఉంది. నెట్ ఫ్లిక్స్ మినీ-సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్ గురించి ట్రైలర్ ఆసక్తిని కలిగించింది. ఈ సిరీస్ లో విజయ్ వర్మ, పంకజ్ కపూర్, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, అరవింద్ స్వామి, అమృత పూరి, దిబ్యేందు భట్టాచార్య, పత్రలేఖ, అనుపమ్ త్రిపాఠి, కన్వల్‌జిత్ సింగ్, ఆదిత్య శ్రీవాస్తవ, సుశాంత్ సింగ్, పూజా గోర్, దియా మీర్జా తదితరులు నటించారు.
IC 814: కాందహార్ హైజాక్ అనేది 188 జీవితాలను గాల్లో ఉంచింది. ఏడు రోజుల పాటు ప్రయాణీకులు బాధ ఎమోషన్‌తో గడిపారు. ఆ సమయంలో వారి ధైర్యం, కఠినమైన నిర్ణయాలను ఆవిష్కరించే మనుగడ స్టోరి ఇది. ట్రైలర్ ఆసక్తిని కలిగించడంతో సిరీస్ గురించి అభిమానులు చాలా థ్రిల్లింగ్‌గా వేచి చూస్తున్నారు. నసీరుద్దీన్ షా, అరవింద్ స్వామి, విజయ్ వర్మ, దియా మీర్జా, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా లాంటి టాప్ స్టార్లు ఇందులో నటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఆగస్టు 29న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుంది.