Begin typing your search above and press return to search.

అగ్ర‌నిర్మాత‌లు అహంభావులు.. త‌క్కువ వేత‌నంతోనే!

ఇండ‌స్ట్రీలో మేం తోపులం అని చెప్పుకునే అగ్ర నిర్మాణ సంస్థ‌లు న‌టీన‌టుల‌కు పారితోషికాలు చెల్లించ‌డంలో ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయ‌నేది తాజా ఆరోప‌ణ‌.

By:  Tupaki Desk   |   24 Oct 2024 10:30 AM GMT
అగ్ర‌నిర్మాత‌లు అహంభావులు.. త‌క్కువ వేత‌నంతోనే!
X

ఇండ‌స్ట్రీలో మేం తోపులం అని చెప్పుకునే అగ్ర నిర్మాణ సంస్థ‌లు న‌టీన‌టుల‌కు పారితోషికాలు చెల్లించ‌డంలో ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయ‌నేది తాజా ఆరోప‌ణ‌. ప్ర‌ముఖ న‌టుడు అగ్ర బ్యాన‌ర్ల‌పై చేసిన ఈ ఆరోప‌ణ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కు వచ్చింది. వివ‌రాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో ద‌శాబ్ధాల కాలంగా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన కరణ్ జోహార్ `ధర్మ ప్రొడక్షన్స్` - ఆదిత్య చోప్రా `యష్ రాజ్ ఫిల్మ్స్` నటీనటులకు తక్కువ వేతనం ఇస్తున్నాయని నటుడు విక్రమ్ కపాడియా ఆరోపించాడు. ఆ రెండు అగ్ర నిర్మాణ సంస్థ‌లు హిందీ సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద‌ నిర్మాణ సంస్థలు. దశాబ్దాలుగా హిందీ చిత్ర‌సీమ‌లో బిగ్ గేమ్ ప్లేయ‌ర్స్ గా ఈ బ్యాన‌ర్లు కొన‌సాగుతున్నాయి. అగ్ర హీరోల‌తో భారీ సినిమాల‌ను నిర్మించాయి ఈ సంస్థ‌లు. ఖర్చులో రాజీ అన్న‌దే లేని సంస్థ‌లు. కానీ ఇప్పుడు ఈ రెండు ప్రొడక్షన్ హౌస్‌లతో కలిసి పనిచేసిన ఒక ప్ర‌ముఖ‌ నటుడు వారి(ఆదిత్య‌, క‌ర‌ణ్‌)ని అహంభావులు అని న‌టీనటుల‌కు ఇతరుల కంటే తక్కువ చెల్లిస్తారని అన్నారు.

విక్రమ్ కపాడియా.. ఇటీవ‌ల ట్రెండింగ్ లో ఉన్న న‌టుడు. మేడ్ ఇన్ హెవెన్, యోధ‌, ది నైట్ మేనేజర్, ది ఆర్చీస్ వంటి సినిమాలు షోల‌తో పాపుల‌ర్ అయ్యాడు. అతడు బాలీవుడ్ నౌతో మాట్లాడుతూ అగ్ర నిర్మాత‌ల‌ను బ‌హిరంగంగా దుయ్య‌బ‌ట్టాడు. పెద్ద స్టూడియోలు నటీనటులకు ఎలా జీతభ‌త్యాలు ఇస్తాయనే దాని గురించి మాట్లాడుతూ, ``యష్ రాజ్, ధర్మాప్రొడ‌క్ష‌న్స్ కి అహం ఉంది. యష్ రాజ్ - ధర్మ కాబట్టి మేము మీకు కొంచెం తక్కువ చెల్లిస్తాము.. కానీ మేము మీకు చెల్లిస్తున్నాము కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి`` అని అడుగుతార‌ని అన్నాడు. వారు అందరితో అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. అందుకే నటీనటులు ఆందోళన చెందుతున్నారు. రెమ్యునరేషన్ తక్కువగా ఉన్నప్పటికీ చెల్లింపులో ఎప్పుడూ జాప్యం జరగదని విక్ర‌మ్ తెలిపారు.

ర‌చయితగా యష్ రాజ్ నాకు మంచి వేతనం ఇచ్చారు. అయితే మీకు పాత్ర లభిస్తోంది.. బ్రేక్ ఇస్తున్నారు కాబట్టి బహుశా పేమెంట్ కొంచెం తక్కువగా ఉండవచ్చు.. కానీ వారు చెల్లింపులో ఎప్పుడూ ఆలస్యం చేస్తారు! అని పాజిటివ్ విష‌యాన్ని కూడా అత‌డు హైలైట్ చేసాడు.

గతంలో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ పారితోషికాల్లో `అధిక ఖర్చు` గురించి మాట్లాడారు. స్టార్లు, వారి ప‌రివారానికి భారీ మొత్తాలు ఇవ్వాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న చెందారు. స్క్రీన్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క‌ర‌ణ్ మాట్లాడుతూ ఇలా అన్నారు. పరివారం ఖర్చు చిన్న‌దే కానీ... నటీనటుల రెమ్యూనరేషన్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. ప‌రిణామాలు మారాయి.. కాలంతో పాటు ఈ మార్పు. ఏదైనా సినిమాల‌ను తెర‌కెక్కించాలంటే ప్ర‌ణాళిక వేయ‌డం చాలా క‌ఠినంగా మారింద‌ని క‌ర‌ణ్ అన్నారు. ఈ ప‌రిస్థితుల‌ను న‌టీన‌టులు సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా కీలకం అని అన్నారు.