రాజమౌళితో సినిమా నిజమే, కానీ..!
తమిళ్ హీరో విక్రమ్ ఇప్పటి వరకు ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించాడు.
By: Tupaki Desk | 29 Aug 2024 7:34 AM GMTతమిళ్ హీరో విక్రమ్ ఇప్పటి వరకు ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించాడు. ఆయన కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తాజాగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పా రంజిత్ సినిమాలు వైవిధ్యభరితంగా, మట్టి వాసన తో ఉంటాయి. తంగలాన్ కూడా అదే తరహాలో ఉండటంతో పాటు, విక్రమ్ మార్క్ కూడా జత చేసుకుని మంచి సినిమాగా నిలిచింది. తంగలాన్ సినిమా కు సౌత్ లో మంచి స్పందన వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆధరించారు.
ఇప్పుడు తంగలాన్ సినిమాను హిందీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సౌత్ లోని అన్ని రాష్ట్రాల్లో తిరిగి ప్రమోషన్ చేసిన విక్రమ్ ఇప్పుడు తంగలాన్ ను ఉత్తర భారతంలో ప్రమోట్ చేస్తున్నారు. జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతూ, ఇంగ్లీష్ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తంగలాన్ హిందీ వర్షన్ ను ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
విక్రమ్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నా నుంచి వచ్చే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అందుకే నేను తంగలాన్ వంటి సినిమాలు చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేస్తే నా ఫ్యాన్స్, ప్రేక్షకులు వాటిని తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి. అందుకే వారు కోరుకునే విధంగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో కథలు, పాత్రలను ఎంపిక చేసుకుంటాను. అపరిచితుడు, పొన్నియన్ సెల్వన్ లో చేసినటువంటి పాత్రలను మళ్లీ మళ్లీ చేయాలనే ఉద్దేశ్యంతో విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటాను. ముందు ముందు కూడా నా నుంచి మరిన్ని విభిన్న పాత్రలతో సినిమాలు వస్తాయి.
పొన్నియన్ సెల్వన్ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు రావడం సంతోషంగా ఉంది. అయితే నాకు కూడా అవార్డ్ వచ్చి ఉంటే మరింత సంతోషంగా ఉండేది అన్నాడు. ఇక రాజమౌళి తో సినిమా గురించి విక్రమ్ స్పందిస్తూ... గతంలో రాజమౌళి సర్ తో సినిమాకు సంబంధించిన చర్చలు జరిగిన విషయం నిజమే. కానీ ఇప్పట్లో మా కాంబోలో సినిమా ఉండదు. భవిష్యత్తులో తప్పకుండా ఆయన దర్శకత్వంలో నటిస్తాను అంటూ విక్రమ్ చెప్పుకొచ్చాడు. హిందీ ప్రేక్షకులు కూడా తంగలాన్ ను ఆధరించే విధంగా దర్శకుడు పా రంజిత్ రూపొందించాడని, తప్పకుండా ఉత్తర భారతంలో కూడా మా సినిమా హిట్ అవుతుందనే విశ్వాసంను విక్రమ్ వ్యక్తం చేశాడు.