Begin typing your search above and press return to search.

విక్రమ్‌ ఇకనైనా ఆలోచించాలి

తమిళ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ గత పదేళ్ల కాలంలో పది సినిమాలకు పైగా చేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   26 March 2025 7:45 AM
Vikrams Recent Movie Veera Dheera Soora 2
X

తమిళ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ గత పదేళ్ల కాలంలో పది సినిమాలకు పైగా చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాల్లో ఒకటి రెండు పర్వాలేదు అనిపిస్తే మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. ఆ పర్వాలేదు అనిపించిన సినిమాలు సైతం విక్రమ్‌ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదని, ఇతర స్టార్‌ హీరోల హిట్‌ సినిమాలతో పోల్చితే ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు అని స్వయంగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. విక్రమ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 35 ఏళ్లు అవుతుంది. మొదట్లో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నా విక్రమ్‌ నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సినిమాలు వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.

కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ విక్రమ్‌కి మంచి క్రేజ్‌ను తీసుకు వచ్చిన సినిమాలు ఉన్నాయి. తెలుగులో విక్రమ్‌ నేరుగా కొన్ని సినిమాలు నటించగా ఎక్కువగా తమిళ్ డబ్బింగ్‌ సినిమాలతో స్టార్‌డం దక్కించుకున్నాడు. ఒకానొక సమయంలో రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తర్వాత టాలీవుడ్‌లో ఆ స్థాయి స్టార్‌డం దక్కించుకున్న కోలీవుడ్‌ హీరోగా విక్రమ్‌ నిలిచాడు. కానీ అది అంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కోలీవుడ్‌లోనే ఆయన సినిమాలకు జనాలు రావడం లేదు. తెలుగులో అయితే విక్రమ్‌ సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడం మానేశారు. అయినా విక్రమ్‌ నటించిన దాదాపు అన్ని సినిమాలను తెలుగులో డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు.

ఈ వారంలో విక్రమ్‌ హీరోగా నటించిన 'వీర ధీర శూర 2' సినిమా విడుదల కాబోతుంది. సూపర్‌ హిట్ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాకు పెద్దగా బజ్‌ క్రియేట్‌ కాలేదు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా బజ్ క్రియేట్‌ కాలేదు. దాంతో అడ్వాన్స్ బుకింగ్ మరీ సాదా సీదాగా ఉన్నాయి. కొత్త హీరోల సినిమాలకు సైతం ఒక మోస్తరు అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు అవుతున్న ఈ రోజుల్లో విక్రమ్‌ వంటి స్టార్‌ హీరో సినిమాకు మినిమం అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు కాలేదు. తమిళనాడులో కాస్త పర్వాలేదు అనిపించినా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్‌ గురించి చర్చే లేదు. అసలు సినిమా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన ఎల్‌ 2 సినిమాకు డీసెంట్‌ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి. కానీ విక్రమ్‌ సినిమా 'వీర ధీర శూర' సినిమా వసూళ్లు నమోదు అయ్యే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి కేరళ, కర్ణాటకలోనూ ఉంది. ఏమాత్రం బజ్‌ లేని ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయడం వృధా ప్రయాస అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను ఎప్పుడో కోల్పోయిన విక్రమ్‌ తన సినిమాల విడుదల విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా విక్రమ్‌ కథల ఎంపిక విషయంలోనూ ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

విక్రమ్‌ తనయుడు ఎలాగూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కనుక పాత్రల ఎంపిక విషయంలోనూ ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిమానులు స్వయంగా కామెంట్‌ చేస్తున్నారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విక్రమ్‌ చేయాల్సిన సమయం వచ్చిందని, ఆ విషయమై విక్రమ్‌ ఆలోచించాలని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.