సాయంత్రం ఆటతో 99% రిలీజ్ ఖాయం
కానీ సినిమా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా వాయిదా పడిందనే వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 27 March 2025 9:24 AMతమిళ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన 'వీర ధీర సూరన్ 2' నేడు విడుదల కావాల్సి ఉండగా ఇప్పటి వరకు షో లు పడలేదు. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా సినిమా విడుదల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం అందుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాకు ఎక్కడా షో పడలేదు. యూఎస్‌లోనూ ఈ సినిమాకు ప్రీమియర్ షోలు పడలేదు. మార్నింగ్ షోను చూసేందుకు విక్రమ్ అభిమానులు థియేటర్ల వద్ద భారీగా చేరారు. కానీ సినిమా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా వాయిదా పడిందనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఈ రోజే సినిమా కాస్త ఆలస్యంగానైనా విడుదల అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
తాజాగా ఈ సినిమాను తమిళనాడులో పంపిణీ చేస్తున్న తిరుపూర్ సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ విడుదల విషయమై క్లారిటీ ఇచ్చాడు. సాయంత్రం 6 గంటల షో తో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నాడు. ఈ రోజే సినిమా విడుదల అయ్యేందుకు 99% అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. సినిమా ఆర్థిక సమస్యలు సాయంత్రం 4 గంటల వరకు పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు సినిమా నిర్మాతల నుంచి ఈ విషయమై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. చిత్రంలో నటించిన వారు సైతం సినిమా విడుదల గురించి ఎలాంటి ప్రకటన చేయడం లేదు.
ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'వీర ధీర సూరన్ 2' సినిమాలో విక్రమ్‌తో పాటు కీలక పాత్రలో దుషారా విజయన్, ఎస్ జే సూర్యలు నటించారు. తమిళనాట ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. తెలుగులోనూ విక్రమ్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో డబ్బింగ్ వర్షన్‌కి మంచి స్పందన వస్తుందని అంతా భావించారు. తెలుగులో ఉన్న విక్రమ్ అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం షో లు క్యాన్సల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. కనీసం సాయంత్రం షో లు పడితే అభిమానులకు ఒకింత సంతృప్తి దక్కుతుంది.
ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయంలో వివాదం నెలకొంది. ముంబైకి చెందిన ఒక సంస్థ ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. దాంతో కోర్ట్ విడుదలపై స్టే విధించింది. అంతే కాకుండా రూ.7 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా నిర్మాతలకు సూచించింది. ఆ విషయమై సాయంత్రం 4 గంటల వరకు పూర్తిగా నిర్మాతలు పరష్కరించే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం ఆటతో ఈ సినిమా విడుదల అయ్యేనా అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.