మరో 'విక్రమార్కుడు'.. సంతోషం మరియు బాధ
రాజమౌళి స్థాయిని, స్టామినాను మరింత పెంచిన సినిమా విక్రమార్కుడు అనడంలో సందేహం లేదు
By: Tupaki Desk | 7 March 2024 6:16 AM GMT18 సంవత్సరాల క్రితం వచ్చిన విక్రమార్కుడు సినిమాను ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు అంటే ఆ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి స్థాయిని, స్టామినాను మరింత పెంచిన సినిమా విక్రమార్కుడు అనడంలో సందేహం లేదు.
మాస్ మహారాజా రవితేజ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించి రాజమౌళి ఆవిష్కరించిన విక్రమార్కుడు సినిమా కు సీక్వెల్ అంటూ చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు విక్రమార్కుడు 2 ఉండబోతుందని నిర్మాత కేకే రాధా మోహన్ అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ కి సంతోషకర వార్తను తెలియజేశాడు.
ఆయన నిర్మాణంలో రూపొందిన భీమా సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే విక్రమార్కుడు 2 సినిమాను ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటించాడు. కథ కూడా రెడీగా ఉందని తెలియజేశాడు.
కథ కు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కచ్చితంగా వెంటనే షూటింగ్ షురూ అవ్వబోతున్నట్లుగా నిర్మాత పేర్కొన్నాడు. విక్రమార్కుడు 2 కథను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేశారట.. కానీ దర్శకత్వం మాత్రం రాజమౌళి వహించే అవకాశం లేదు. రాజమౌళి లేకుండానే విక్రమార్కుడు 2 సినిమా అనేది బాధ కలిగించే విషయం.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విక్రమార్కుడు 2 సినిమాకు సంపత్ దర్శకత్వం వహించబోతున్నాడట. ప్రస్తుతం సంపత్ విక్రమార్కుడు 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడని, రాజమౌళి మేకింగ్ కు ఏమాత్రం తగ్గకుండా రెండో పార్ట్ ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి విక్రమార్కుడు 2 రాబోతుంది అనేది కన్ఫర్మ్. అయితే దానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు కానీ రాజమౌళి దర్శకత్వం వహించబోవడం లేదు. కథ మరియు పాత్రలు అవే అయితే కచ్చితంగా ఎవరు దర్శకత్వం వహించినా హిట్ కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.