12 ఏళ్ల వెయిటింగ్‌కి ఫుల్‌స్టాప్.. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్
మదగజరాజా సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రారంభం అయ్యింది. షూటింగ్ సైతం పూర్తి అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు.
By: Tupaki Desk | 3 Jan 2025 9:42 AM GMTసినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రారంభం అవుతాయి. అయితే ప్రారంభం అయిన సినిమాల్లో కేవలం 70 నుంచి 80 శాతం సినిమాలు మాత్రమే థియేటర్ వరకు వస్తాయి. మిగిలిన 20 నుంచి 30 శాతం సినిమాలు షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే ఆగి పోతాయి, కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలో ఉండగా నిలిచి పోతాయి, కొన్ని సినిమాలు షూటింగ్ ముగింపు దశలో ఉండగా ఆగి పోతాయి. కొన్ని మాత్రం షూటింగ్ మొత్తం పూర్తి అయినా విడుదలకు ఏవో కారణాల వల్ల నోచుకోక పోవచ్చు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమాల జాబితాలోకి వచ్చే సినిమా విశాల్ నటించిన 'మదగజరాజా'.
మదగజరాజా సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రారంభం అయ్యింది. షూటింగ్ సైతం పూర్తి అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అప్పట్లో విశాల్‌కి జోడీగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్‌లు నటించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తున్నాం అంటూ నిర్మాతలు ప్రకటించడం, ప్రమోషన్ కార్యక్రమాలు సైతం మొదలు అయ్యాయి. కాని సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు వాయిదా పడింది. అప్పటి నుంచి సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఆ సినిమా గురించిన ఊసే లేదు. అసలు సినిమా వస్తుందని ఏ ఒక్కరూ అనుకోలేదు.
ఆ సినిమా గురించి అంతా మరచి పోతున్న ఈ సమయంలో అనూహ్యంగా సినిమా ప్రమోషన్స్ షురూ అయ్యాయి. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని ప్రకటించారు. విశాల్ ఈమద్య కాలంలో తమిళనాట మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆయన నటించిన సినిమాలు మినిమం గ్యారెంటీ అన్నట్టుగా అక్కడ వసూళ్లు సొంతం చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో మదగజరాజా సినిమాను విడుదల చేయడం ద్వారా కచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడం మాత్రమే కాకుండా సినిమాకు మంచి వసూళ్లు సొంతం చేసుకోవచ్చు అనే నమ్మకంతో నిర్మాతలు సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో హర్రర్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలుస్తున్న దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించగా హీరోగా వరుస సినిమాలు చేస్తున్న విజయ్ ఆంటోనీ అప్పట్లో సంగీతాన్ని అందించాడు. సినిమాకు అప్పట్లోనే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కానీ విడుదల చేయక పోవడంతో ఇప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పొంగల్‌కి తమిళ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు ఏమీ లేవు. అందుకే ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా కచ్చితంగా మంచి ఫలితాన్ని సొంతం చేసుకోవచ్చు అనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పెద్దగా చిత్ర హీరో, హీరోయిన్స్ ప్రచారం చేయకుండానే సినిమా రాబోతుంది.