సినిమాలు తీయని నిర్మాతలే కుట్రలు చేస్తారు: విశాల్
విశాల్ తో నిర్మాతలు ఎవరూ సినిమాలు తీయొద్దని, బ్యాన్ ఆర్డర్ పాస్ చేసింది.
By: Tupaki Desk | 27 July 2024 4:35 AM GMTతమిళ సినీ నిర్మాతల మండలి తనపై ఆరోపణలు చేయడంతో విశాల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. విశాల్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మండలి నిధులను దుర్వినియోగం చేశారని ప్రస్తుత మండలి కీలక సభ్యులు ఆరోపించారు. విశాల్‌తో కలిసి పనిచేసే నిర్మాతలు, సాంకేతిక నిపుణులు తమను సంప్రదించవలసిందిగా కోరుతూ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ నిధుల నుంచి దాదాపు రూ.12 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, అసోసియేషన్ కు నష్టం వాటిల్లిందని కూడా ప్రకటనలో మండలి పేర్కొంది. విశాల్ తో నిర్మాతలు ఎవరూ సినిమాలు తీయొద్దని, బ్యాన్ ఆర్డర్ పాస్ చేసింది.
అయితే కౌన్సిల్ నిర్ణయంపై విశాల్ ప్రతిస్పందించారు. తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో మండలి నిర్ణయాన్ని సవాల్ చేసారు. ''ఇది(ఈ ఖర్చు) మీ టీమ్‌లోని మిస్టర్ కతిరేసన్ (అతడికి అన్నీ తెలుసు)తో కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం అని మీకు తెలియదా? నిధులు సంక్షేమ పనుల కోసం ఉపయోగించాం. నిర్మాతల మండలిలోని పాత సభ్యులు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఖర్చు చేసాం'' అని వివరణ ఇచ్చారు.
అంతేకాదు మండలి అధ్యక్షకార్యదర్శులను ప్రగతిశీలంగా ఆలోచించమని విశాల్ కోరాడు. ''మీ ఉద్యోగాలను సరిగ్గా చేయండి.. పరిశ్రమ కోసం చేయాల్సిన పని చాలా ఉంది. విశాల్ ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాడు. సినిమాలు నిర్మించని, ఎన్నటికీ నిర్మించని నిర్మాతలే నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు'' అని ఆరోపించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. విశాల్ చివరిసారిగా సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో 'రత్నం'(2024) చిత్రంలో కనిపించాడు. ఒక నీతిమంతుడైన ఎమ్మెల్యే అనుచరుడి కథతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. ప్రియా భవాని శంకర్, సముద్రఖని, గౌతం వాసుదేవ్ మీనన్, యోగి బాబు, మురళీ శర్మ, హరీష్ పేరడి తదితరులు నటించారు. ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న 'తుప్పరివాళన్ 2' చిత్రంలోను విశాల్ నటిస్తున్నాడు.