Begin typing your search above and press return to search.

విశాల్ సటైర్ లు ఆ స్టార్ హీరో పైనేనా?

త‌న త‌దుప‌రి చిత్రం రత్నం ప్రమోష‌న్స్‌లో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, విశాల్ తన రాజకీయ ఆకాంక్షలకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసాడు.

By:  Tupaki   |   17 April 2024 3:10 PM GMT
విశాల్ సటైర్ లు ఆ స్టార్ హీరో పైనేనా?
X

ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే తమిళనాడులో సినిమా స్టార్లు రాజ‌కీయాల్లోకి రావ‌డం నిరంత‌రం చూస్తుంటాం. దేశ‌వ్యాప్తంగా ఈసారి ఎన్నిక‌ల్లోకి స్టార్లు విస్త్ర‌తంగా ప్ర‌వేశిస్తున్నారు. రాజ‌కీయాల‌తో సినిమా తార‌ల‌ సంబంధం నిరంతరం చర్చలకు దారి తీస్తోంది. కొత్త పార్టీలను ఏర్పాటు చేయడం లేదా ఇప్పటికే ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎక్కువ మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రచయిత ఎం కరుణానిధి, నటులు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జే జయలలిత మొదలుకొని విజయకాంత్ (దివంగ‌తుడు), కమల్ హాసన్, శివాజీ గణేశన్, ఆర్ శరత్‌కుమార్, ఉదయనిధి స్టాలిన్ ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం ద‌ళ‌పతి విజయ్ తమిళనాడులో రాజకీయ నాయకుడిగా మారాడు. సొంత పార్టీని ప్ర‌క‌టించాడు.

ఇంత‌లోనే నిర్మాత కం స్టార్ హీరో విశాల్ తన రాజకీయ అరంగేట్రాన్ని ధృవీకరించారు. 2026 త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇంతలోనే తన ఎత్తుగడను వివ‌రిస్తూనే, విశాల్ పరోక్షంగా రజనీకాంత్ రాజ‌కీయ వైఫ‌ల్యాన్ని విమ‌ర్శించాడు. త‌న త‌దుప‌రి చిత్రం రత్నం ప్రమోష‌న్స్‌లో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, విశాల్ తన రాజకీయ ఆకాంక్షలకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసాడు. ''అవును,.. నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను. నేను వస్తాను లేదా ఆయన (దేవుడు) చెబితేనే వస్తాను.. లేదా నేను రాగానే వచ్చిన‌ట్టు! వగైరాలు చెప్పకుండా నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను'' అని విశాల్ సెటైరిక‌ల్ గా స్పందించాడు.

విశాల్ స్పష్టంగా పేరును ప్రస్తావించక‌పోయినా అత‌డి సెటైర్ ఎవ‌రిపైనో అర్థం చేసుకోగ‌లం. నెటిజనులు దీనిని సూప‌ర్ స్టార్ రజనీకాంత్ రాజ‌కీయ వైఫ‌ల్యంపై ముసుగు దాడి ఇది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చాలా కాలం పాటు న‌సిగారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం దేవుని దీవెన ఉంటేనే సాధ్యం... అని కూడా అన్నారు. రెండు దశాబ్దాలుగా తన రాజకీయ ఆరంగేట్రం గురించి ఊహాగానాలు కొనసాగుతున్న క్ర‌మంలో సూపర్ స్టార్ ర‌జనీకాంత్ 2021లో తన సొంత పార్టీని స్థాపించాలనే ఉద్దేశాన్ని డిసెంబర్ 2020లో ధృవీకరించారు. అయితే, నెలాఖరులో అనారోగ్యం, క‌రోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా అత‌డు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.గతంలో తన 'ఆధ్యాత్మిక' ప్రకటనల మాదిరిగానే రాజ‌కీయారంగేట్రంపై రజనీకాంత్ తన నిర్ణయాన్ని దేవునికి ఆపాదించారు.

''నేను దీనిని (ఆసుపత్రి) దేవుడు నాకు ఇచ్చిన హెచ్చరికగా చూస్తున్నాను. మహమ్మారి మధ్య నా ప్రచారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది'' అని ర‌జ‌నీ వ్యాఖ్యానించారు. వీట‌న్నిటినీ ఎత్తి చూపుతూనే విశాల్ సెటైరిక‌ల్ గా స్పందించాడా? అంటూ ఇప్పుడు నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగుతోంది. కానీ విశాల్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకి అభిమాని. ర‌జ‌నీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్యానించే అవ‌స‌రం ఉందా? అంటే దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.