విశాల్.. గట్టి హిట్ పడితే గానీ..
కోలీవుడ్ లో మోస్తరు వసూళ్లను రాబట్టొచ్చేమో కానీ తెలుగులో మాత్రం రత్నం మూవీ కనీస వసూళ్లు సాధించడం కూడా కష్టమే.
By: Tupaki Desk | 28 April 2024 5:17 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు టాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన యాక్ట్ చేసిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. అలా తాజాగా టాలీవుడ్ సినీ ప్రియుల ముందుకు వచ్చిన సినిమా రత్నం. మాస్ డైరెక్టర్ హరి, విశాల్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన భరణి, పూజ చిత్రాలు మంచి హిట్ అయ్యాయి.
ఇక రిలీజ్ కు ముందే ఎలాంటి బజ్ క్రియేట్ చేయని రత్నం సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. పాత స్టోరీనే మళ్లీ డైరెక్టర్ హరి చూపించారని రివ్యూలు వచ్చాయి. హరి గత సినిమాల్లో ఉన్న స్క్రీన్ ప్లే ఈ సినిమాలో మిస్ అయింది. స్లో నేరేషన్ రత్నంకు పెద్ద మైనస్. యాక్షన్ సీన్స్ అదిరిపోయినా.. కథ రొటీన్ గా సాగుతోంది. విశాల్ చేతికి కత్తి వచ్చాక విజిల్స్ పడినా.. ఓవరాల్ గా మూవీ మాత్రం సినీ ప్రియులను మెప్పించలేకపోయింది.
కోలీవుడ్ లో మోస్తరు వసూళ్లను రాబట్టొచ్చేమో కానీ తెలుగులో మాత్రం రత్నం మూవీ కనీస వసూళ్లు సాధించడం కూడా కష్టమే. ఇక ఇంతకు ముందు విశాల్ నటించిన ఎనిమీ, లాఠీ, మార్క్ ఆంటోనీ, యాక్షన్ మూవీలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇప్పుడు రత్నం మూవీతో విశాల్ హిట్ కొడతారని అనుకున్నా.. అది జరగలేదు. తెలుగులో క్లీన్ హిట్ అవ్వాలంటే రత్నం సినిమా రూ.4.50 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
అలా జరగడం అసాధ్యమనే చెప్పాలి. దీంతో తెలుగు సినీ మార్కెట్ లో హీరో విశాల్ పరిస్థితి పట్ల ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాల్ మార్కెట్ పూర్తిగా తగ్గిపోయిందని చెబుతున్నారు సినీ పండితులు. ఇటీవల రిలీజ్ అయిన రత్నం మూవీ కాస్తో కూస్తో హిట్ అయ్యింటే ఆయన మార్కెట్ కొంచెం పుంజుకునేదని, ఇప్పుడు ఉన్నది కూడా తగ్గిపోయిందని అంటున్నారు.
విశాల్ సాధారణ యాక్షన్ సినిమాలకు తెలుగు సినీ ప్రియులు పరుగులు తీసే రోజులు పోయాయని చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద నార్మల్ యాక్షన్ మూవీస్ పెద్ద వసూళ్లు సాధించవని అంటున్నారు. టాలీవుడ్ ప్రేక్షకుల ఆలోచనా విధానం మొత్తం మారిపోయిందని మరోసారి గుర్తు చేస్తున్నారు. విశాల్ మార్కెట్ మళ్లీ పుంజుకోవాలంటే భారీ హిట్ కొట్టాల్సి ఉందని చెబుతున్నారు. మరి విశాల్ తెలుగు మార్కెట్ లో తన స్థానాన్ని తిరిగి పొందగలరా లేదా అనేది వేచి చూడాలి.