అసెంబ్లీ ఎన్నికల బరిలో పక్కా.. తేల్చేసిన స్టార్ హీరో!
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. షెడ్యూల్ ప్రకారం 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి
By: Tupaki Desk | 15 April 2024 4:34 AM GMTతమిళులకు మాత్రమే కాదు తెలుగు వారికి సుపరిచితులైన అగ్ర హీరో విశాల్. తన యాక్షన్ సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన అతను.. తాజాగా సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయమంటూ విశాల్ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. షెడ్యూల్ ప్రకారం 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని విశాల్ వెల్లడించారు. అయితే..తాను ఏ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉంటానన్న విషయాన్ని మాత్రమే చెబుతానని పేర్కొనటం గమనార్హం. ప్రజలకు మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితుల్లోనే తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే.. వాటిల్లో ఒక ప్రశ్నకు మాత్రం ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న విశాల్ ను.. ‘‘ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? సొంతంగా పార్టీ పెడతారా?’’ అంటూ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘అవన్నీ ఇప్పుడే చెప్పేయలేను. ఇప్పుడే చెప్పేస్తే అప్పట్లో విజయకాంత్ కు జరిగినట్లే నాకు జరిగే వీలుంది. ఆయనకు కల్యాణ మండపం ఉంది. దాంతో దాన్ని కూల్చేశారు. నాకు అది కూడా లేదు. టైం రావాలే కానీ అన్ని విషయాల్ని చెప్పేస్తా’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ జరిగిందన్న మాట వినాలని ఉందన్న విశాల్ మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విశాల్ తాజా ప్రకటన కోలీవుడ్ లో కొత్త చర్చకు తెర తీసింది.