Begin typing your search above and press return to search.

బెట్టింగ్ యాప్‌ల కేసు: విచారణలో విష్ణుప్రియ ఏం చెప్పిందంటే?

ఈ యాప్‌ల మాయలో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు వీటిని ప్రోత్సహించిన ప్రముఖులపై దృష్టి సారించారు.

By:  Tupaki Desk   |   20 March 2025 4:13 PM
బెట్టింగ్ యాప్‌ల కేసు: విచారణలో  విష్ణుప్రియ  ఏం చెప్పిందంటే?
X

బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ యాప్‌ల మాయలో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు వీటిని ప్రోత్సహించిన ప్రముఖులపై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేయగా, మరికొందరిని విచారణకు పిలిచారు. ఈ క్రమంలో యాంకర్ విష్ణుప్రియ గురువారం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. విష్ణుప్రియ పోలీసుల విచారణలో పూర్తి సహకారం అందించారు. ఆమెను అడగగానే అన్ని విషయాలు నిజాయితీగా చెప్పినట్లు తెలుస్తోంది. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆమె అంగీకరించడమే కాకుండా, ఆ ప్రకటనల ద్వారా భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు కూడా వెల్లడించినట్లు సమాచారం. దాదాపు 15 బెట్టింగ్ యాప్‌లకు తాను ప్రమోషన్ చేశానని ఆమె ఒప్పుకున్నట్లు తెలిసింది..

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కోసం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించినట్లు విష్ణుప్రియ అంగీకరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ పోలీసులకు చెప్పానని, అంతకు మించి తనకు ఏమీ తెలియదని ఆమె స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్‌లతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల నోటీసుల మేరకు విష్ణుప్రియ గురువారం ఉదయం తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం లోగానే పోలీసులు ఆమె విచారణను ముగించి పంపించివేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

అయితే విష్ణుప్రియ విచారణలో ఏం చెప్పింది అన్నది అటు పోలీసులు కానీ.. ఇటు విష్ణుప్రియ కానీ అధికారికంగా మీడియా ముందు చెప్పలేదు. మీడియాలో ఈ మేరకు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి..